
సాక్షి, కృష్ణా జిల్లా: జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి కృష్ణా జిల్లా జడ్పీటీసీలు ఫిర్యాదు చేశారు. గుడివాడలో జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై దాడి సమాజం తలదించుకునేలా ఉందని జడ్పీటీసీలు అన్నారు. హారికపై దాడిని తీవ్రంగా ఖండించారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు, గౌరవం లేదు. ఉన్నత పదవిలో ఉన్న ఒక మహిళకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం.. సామాన్య ప్రజలకు, మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని కోరామని జడ్పీటీసీలు తెలిపారు.
ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జడ్పీటీసీలు మండిపడ్డారు. జడ్పీ చైర్‌పర్సన్ పదవిలో ఉన్న మహిళకే రక్షణ లేకుండా పోయింది. జిల్లా ప్రథమ పౌరురాలికే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి?. ఆడపిల్లకు కష్టం కలిగితే తాట తీస్తామని చంద్రబాబు, పవన్ కబుర్లు చెబుతున్నారు. అయ్యా పవన్ ఎక్కడున్నావ్?. గుడివాడలో ఇంత జరిగితే ఏం చేస్తున్నావ్? ఎందుకు తాట తీయడం లేదు?’’ అంటూ జడ్పీటీసీలు ప్రశ్నించారు.
గుడివాడలో ఉప్పాల హారిక కారు పై దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి. రక్షించాల్సిన పోలీసులు టీడీపీ భటుల్లా మారారు. గంటన్నర పాటు టీడీపీ, జనసేన గూండాలు హారిక కారును నిర్భంధిస్తే పోలీసులు చోద్యం చూశారు. కృష్ణాజిల్లా ఎస్పీ తక్షణమే స్పందించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని జడ్పీటీసీలు డిమాండ్ చేశారు.