సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు సంఖ్యాబలం తక్కువగా ఉండటం, ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం కావడంతో ఆయన అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలను వేగవంతం చేశారు.
ఇందులో భాగంగా విజయ్ వామపక్షాల మద్దతు కోసం.. పార్టీ జనరల్ జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల క్రితం వామపక్షాలకు లేఖ రాసి మద్దతు కోరిన టీవీకే, ఇప్పుడు నేరుగా నేతలతో సమావేశమై మద్దతు పొందే ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు, వామపక్షాలు ఇప్పటికే డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ‘ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని వామపక్షాలే నిర్ణయించాలి’ అని స్టాలిన్ స్పష్టంగా చెప్పారు. దీంతో వామపక్షాల నిర్ణయం కీలకంగా మారింది. రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న అంశంపై స్పష్టత రానుంది. అప్పటి వరకు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగనుంది.
ఇక కాంగ్రెస్ ఇప్పటికే ఐదుమంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించింది. సీపీఐ,సీపీఎం,వీసీకే వంటి వామపక్షాలు టీవీకేకు మద్దతు ఇస్తే సంఖ్య 118 దాటే అవకాశం ఉంది. అదే జరిగితే విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. కానీ ఏఐఏడీఎంకే మాత్రం మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించింది. టీవీకే మద్దతుదారులు లోక్‌భవన్ వద్ద నిరసనలు చేపడుతున్నారు. గవర్నర్ ఆలస్యంపై పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు.


