వారి పుట్టుక తెలంగాణ.. ఆత్మలు ఆంధ్రవి! 

TRS Ministers Srinivas Goud Niranjan Reddy Slams Congress Party Leaders - Sakshi

కాంగ్రెస్‌ నేతలపై మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజం  

ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరుకు అన్యాయం జరిగిందని వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల పుట్టుక తెలంగాణలోనే అయినా వారి ఆత్మలు మాత్రం ఆంధ్రవని మంత్రులు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజల బతుకు గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్‌ నేతలకు సిగ్గుండాలంటూ మండిపడ్డారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎంపీ రాములుతో కలసి బుధవారం ఇక్కడ టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ అప్పట్లో శ్రీకృష్ణ కమిటీకి కాంగ్రెస్‌పార్టీ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు.

2014కు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు కూడా సాగునీరివ్వలేదని, ఆర్డీఎస్‌ ఆయకట్టును మాత్రం 20 వేల ఎకరాలకు కుదించిందని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్టుల విషయమై కాంగ్రెస్‌పార్టీని వందల సార్లు విమర్శించారని గుర్తుచేశారు. శ్రీకాంతాచారి ఫొటోలు వాడుకోవడం, ఆయన విగ్రహానికి దండలు వేయడం కాంగ్రెస్‌ దౌర్భాగ్యానికి నిదర్శనమని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అరుపులు, కేకలతో అధికారం దక్కదని, తెలంగాణ ఎల్లలు తెలియనివారు కూడా విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

పాలమూరు పచ్చగా మారుతుంటే..
పాలమూరు జిల్లా పచ్చగా మారుతుంటే కాంగ్రెస్‌ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయని శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. తెలంగాణలోనే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఎక్కువగా భర్తీ చేశామని, కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఇక్కడి నిరుద్యోగుల భవిష్యత్తు బాధ్యతను టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్‌  మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని, శాశ్వతఖైదీగా అక్కడే ఉంటారని బాలరాజు అన్నారు.

బ్లాక్‌మెయిల్‌కు రేవంత్‌రెడ్డి ‘జంగ్‌ సైరన్‌’ అని కొత్తపేరు పెట్టారని ఎద్దేవా చేశారు. తాము సహనం కోల్పోతే చీల్చి చెండాడుతామంటూ గువ్వల విరుచుకుపడ్డారు. జంగ్‌ సైరన్‌ సభల్లో కాం గ్రెస్‌నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని రాములు ఆరోపించారు.   
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top