మసిపూసి మారేడు కాయ... ఇంకోసారి! | Tirupati Stampede: Kommineni Comments On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

మసిపూసి మారేడు కాయ... ఇంకోసారి!

Jul 29 2025 10:41 AM | Updated on Jul 29 2025 12:40 PM

Tirupati Stampede: Kommineni Comments On Chandrababu Govt

తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణను తూతూ మంత్రంగానే ముగించినట్లు అనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు వేసే విచారణ కమిషన్లలో ఫలితాలు ఇదే తరహాలో ఉంటాయన్న భావన బలపడుతోంది. కమిషన్‌ నియామకం తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సాక్ష్యాలు ఇప్పించేలా జాగ్రత్తపడతారో, లేక మరే కారణమో తెలియదు కానీ నివేదికలు మాత్రం ‘‘గజం మిథ్య, పలాయనం మిథ్య’’ చందంగానే వస్తుంటాయి.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యమన్న భావన కారణంగా ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఏ జాగ్రత్తలు తీసుకునేవారో స్పష్టంగా తెలియదు కానీ గతంలో ఎన్నడూ తొక్కిసలాటలు జరగలేదు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చాక మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ వివాదాలకు కారణమవుతూండటం ఆశ్చర్యకరమైన విషయమే. స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలుస్తోందని సీఎం ఆరోపించడం, కొనసాగింపుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్తీ అయిన నేతితో తయారు చేసిన లడ్డూలనే అయోధ్యకు కూడా పంపించారని అనడం తీవ్ర సంచలనమైంది.

చిత్రం ఏమిటంటే ఈ నెయ్యి సరఫరా అయింది కూటమి అదికారంలోకి వచ్చిన తర్వాతే. అయినా నెపాన్ని గత వైసీపీ ప్రభుత్వంపై, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నెట్టేసేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన అభ్యర్థనపై విచారించిన సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుకు ఆదేశించింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కమిటీని ప్రభావితంగా చేసే విధంగా యత్నించక పోలేదు. అది వేరే సంగతి.

అయితే జంతు కొవ్వు కలిసిందన్న పిచ్చి ఆరోపణకు ఆధారాలు కనిపించకపోవడంతో కూటమి నేతలు ఆ ఊసు ఎత్తడం మానేశారు. కల్తీ నెయ్యి అనడం ఆరంభించారు. తెలుగుదేశం మీడియా కూడా అలాగే స్వరం మార్చింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కొన్నిసార్లు టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి తగిన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వెనక్కి పంపుతారు. ఈ సారి కూడా అలాగే జరిగింది. అయినా మ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలేశుడిని కూడా వాడుకునే యత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. 

ఆ తరువాత కొంత కాలానికి తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగింది. దానిపై కూడా ముఖ్యమంత్రి తిరుపతి వెళ్లి టీటీడీ కార్యనిర్వాహణాధికారి శ్యామల రావును, టీటీడీ ఛైర్మన్‌ బి.ఆర్.నాయుడును బహిరంగంగానే మందలించినట్లు వార్తలు వచ్చాయి. అవి కూడా టీడీపీ మీడియాలోనే ప్రముఖంగా వచ్చాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బోర్డు ఛైర్మన్‌, ఈవోలు ఈ ఘటనకు బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తొలుత ఒప్పుకోని ఛైర్మన్‌ ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సత్యనారాయణ మూర్తి కమిషన్ మాత్రం వీరెవరిని తప్పు పట్టకపోవడం ఆశ్చర్యం.

సాధారణంగా ముఖ్యమైన సందర్భాలలో సీఎం, దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ ట్రస్ట్ బోర్డు సమీక్షలు చేసి నిర్ణయాలు చేస్తుంటారు. భద్రతా చర్యలపై ఆదేశాలు ఇస్తుంటారు. భక్తుల పరంగా చూస్తే వైకుంఠ ద్వార దర్శనం కూడా ప్రముఖమైందే. భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసినా, సీఎం, మంత్రి సీరియస్‌గా తీసుకోలేదా? బోర్డు చూసుకుంటుందని అనుకున్నారా? అదే టైమ్‌లో బోర్డు తిరుపతిలో టోకెన్లు పంపిణీకి నిర్ణయం తీసుకుని తగు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్న అభిప్రాయం ఉంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్ల పర్యవేక్షణ లోపం కూడా ఉందని అప్పట్లో ప్రభుత్వం భావించింది. తొక్కిసలాట ఘటనపై ఇద్దరు టీటీడీ అధికారులను సస్పెండ్ చేయడంతోపాటు ఎస్పీ, ఆలయ జేఈవోలను బదిలీ చేశారు. కాని అనతికాలంలోనే ఎస్పీకి పోస్టింగ్ ఇచ్చేశారు.

న్యాయ విచారణ సంఘం తనకు ఇచ్చిన సాక్ష్యాధారాల ప్రకారం కేవలం డెయిరీ ఫామ్‌ అధికారి హరినాథ రెడ్డి క్రైమ్ డీఎస్పీ రమణకుమార్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారస్ చేయగా దానిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్పీతోసహా వివిధ శాఖల అదికారులకు టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగించగా, వారెవ్వరి జోలికి వెళ్లకుండా ఇద్దరు అధికారులపైనే క్రిమినల్ చర్య తీసుకోవడం ఏమిటని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. ఈ నివేదికను వైసీపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులు కాబట్టి, వారిని కాపాడేందుకు నివేదికను నీరు కార్చారని భూమన ఆరోపించారు.

ఈ ఘటనలో వాస్తవాలు  బయటపడడానికి, నిజమైన బాధ్యులెవరో తేల్చడానికి సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు. కాని ప్రభుత్వం అందుకు సిద్దపడదు. తొక్కిసలాట ఘటనలో ఎవరి తప్పు  ఎంత అన్నది తేల్చాలని చిత్తశుద్దితో ప్రభుత్వం భావించి ఉంటే, రాష్ట్ర  ప్రభుత్వానికి సంబంధం లేని సంస్థతో దర్యాప్తు చేయించి ఉండేది.  ఇలాంటి వాటిలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఏదో పెద్ద చర్య తీసుకోబోతున్నట్లు హడావుడి చేస్తారు. ఆ తరువాత ప్రభుత్వానికి లేదా, తనకు ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నాయని అనుకుంటే క్రమంగా తీవ్రతను తగ్గిస్తారు. వీలైతే ప్రత్యర్ధులపై దుష్ప్రచారం చేయిస్తారు. తిరుమలకు సంబంధించి కూడా ఆయా ఘటనలల్లో అలాగే చేశారు. ఎక్కడ వీలైతే అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బురద వేయడానికి యత్నించారు.  

గత టర్మ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో గోదావరి పుష్కరాలు నిర్వహించినప్పుడు పెద్ద తొక్కిసలాట జరిగి 29 మంది భక్తులు మరణించారు. దానికి చంద్రబాబు కుటుంబ సభ్యులు సాధారణ భక్తులకు కేటాయించిన ఘట్టంలో స్నానం చేయడం దాన్ని డాక్యుమెంటరీగా తీయడానికి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనును నియోగించడం, ఆయన ఆ పనిలో ఉన్నప్పుడు భక్తులను గేట్ల వద్దే నిలువరించడం, ఒక్కసారిగా వాటిని తెరవడంతో తొక్కిసలాట దుర్ఘటన చోటు చేసుకుంది. దీనిపై టీడీపీ సర్కార్ వేసిన కమిషన్‌ సీఎం సహా ముఖ్యమైన అధికారులెవ్వరిని పెద్దగా తప్పు పట్టలేదు. భక్తులు అధికంగా రావడం, మీడియా విపరీత ప్రచారాలను కారణాలుగా తేల్చి సరిపెట్టేసింది.

దీనిపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కూడా మాయమైందన్న ఆరోపణలు వచ్చాయి. కమిషన్ దాని జోలికి వెళ్లలేదన్న  అభిప్రాయం ఉంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వంటి వారు ఈ కమిషన్ విచారణ తీరును అప్పట్లో తీవ్రంగా ఆక్షేపించారు. చివరికి అంత పెద్ద ఘటనలో ఒక్కరిపై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. ఇంకో ఉదాహరణ చెప్పాలి. కాపులను బీసీలలో చేర్చే అంశంలో కర్ణాటకకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి మంజునాథ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ వివిధ ప్రాంతాల్లో పర్యటించి కాపులతోపాటు, బీసీ వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంది.

కమిషన్ ఛైర్మన్ మంజునాథ ప్రభుత్వం అనుకున్నట్లు నివేదిక ఇవ్వబోవడం లేదన్న అనుమానం వచ్చిన చంద్రబాబు సర్కార్ ఆయనతో సంబంధం లేకుండా కమిషన్ సభ్యులతో ఒక నివేదిక ఇప్పించుకుని సభలో పెట్టడం  వివాదాస్పమైంది. ఈ మధ్య  మాజీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న వాహనం తగిలి ఒక వ్యక్తి మరణించారు. ఆ ప్రమాదంలో జగన్‌ను కూడా బాధ్యుడిని చేస్తూ కేసు పెట్టింది. జగన్ మానవత్వం లేకుండా వ్యవహరించారని చంద్రబాబు దుష్ప్రచారం కూడా చేశారు.కాని 29 మంది మరణించిన గోదావరి పుష్కరాల దుర్ఘటనలో కాని, ఆరుగురు మరణించిన తిరుపతి తొక్కిసలాట ఘటనలో కాని కీలకమైన వ్యక్తులు ఎవరిపై కేసులు రాకపోవడం గమనార్హం.


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement