'మీనాన్న బతుకు బీడీకట్ట, హవాయి చెప్పులతో ప్రారంభమైంది.. మా నాన్న పుట్టుకతోనే శ్రీమంతుడు'

Thopudurthi Prakash Reddy Fires on TDP Leader Paritala Sriram - Sakshi

రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తి ఎంత..ఇప్పుడెంత

భూపోరాటం చేసి ఉంటే మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి 

శ్రీరామ్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి 

సాక్షి, అనంతపురం: ‘‘పరిటాల శ్రీరామ్‌.. జూనియర్‌ ఆర్టిస్ట్‌ బాబూ... బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది. మా నాన్న పుట్టుకతోనే శ్రీమంతుడు. మా పూర్వీకులకు 200 ఎకరాలు భూమి ఉండేది. మీలా మేము అవినీతి చేసి దోచుకోలేదు. ప్రజాసేవలో మా డబ్బే ఖర్చు చేశాం’’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. పరిటాల శ్రీరామ్‌ అనే జూనియర్‌ ఆర్టిస్టుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు.

ఒకసారి రాప్తాడు అని, మరో సారి ధర్మవరం నుంచి పోటీ చేస్తానని చెప్పడం చూస్తే రానున్న ఎన్నికల్లో టికెట్‌ ఎక్కడ ఇస్తారో...ఆ పార్టీలో అతని స్థానం ఏమిటో తెలుస్తోందన్నారు. ‘‘బాబూ జూనియర్‌ ఆర్టిస్టు... నీ రాజకీయ ఎత్తుగడలు రాప్తాడులో నావద్ద చూపు... అంతేగానీ ధర్మవరం కేతిరెడ్డి వద్ద చూపావనుకో...ఆయన నా అంత మంచోడు కాదు. ముందు మీ పార్టీలో మీకు టిక్కెట్‌ ఇస్తారో లేదో మీ అధినాయకుడు వద్దకు వెళ్లి తెల్చుకో... అప్పుడు రాజకీయాలు చేయి’’ అని హితవు పలికారు. మీరు, మీ కుటుంబీకులు అక్రమంగా సంపాదించిన ఆస్తులకు ప్రజా పోరాటం అని చెప్పడం తగదన్నారు. భూస్వాములపై వ్యతిరేకంగా పరిటాల కుటుంబం పోరాడి ఉంటే...వారికి అన్ని ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో లెక్క చెప్పాలని నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టి, మాయ మాటలు చెప్పడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. 

చదవండి: (పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్)

తామేదో చేశామని పరిటాల శ్రీరామ్‌ చెబుతున్న ప్రాంతం రాప్తాడు నియోజకవర్గంలోకే రాదన్నారు. అక్కడ తమకు ఎలాంటి భూమి లేదన్నారు. తాము పరిటాల కుటుంబీకులు అక్రమంగా సంపాదించిన భూమి, ఆస్తుల వివరాలు అడిగితే.. వాటిపై మాట్లాడకుండా అసత్యాలు, కల్ల్లబొల్లి మాటలు చెప్పడం తగదన్నారు. పరిటాల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలపై వారం వారం ఆధారాలతో మీడియా ముందు ఉంచుతామన్నారు.  తమ చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే ఉంటామనీ, పార్టీ అభివృద్ధికే శ్రమిస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top