
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, తొందర పడవద్దంటూ మక్కల్ ఇయక్కం సభ్యులకు దళపతి విజయ్ హితబోధ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన అభిమాన సంఘంతో ఆయన రెండు రోజులుగా భేటీ అవుతున్నారు. సీనినటుడు, దళపతి విజయ్‌కు అభిమాన లోకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌ను రాజకీయాల్లోకి రప్పించేందుకు అభిమానులు, ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విజయ్ మక్కల్ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చేందుకు సీఈసీకి చంద్రశేఖర్ దరఖాస్తు చేసుకున్నారు. దీనికి విజయ్ వ్యతిరేకత తెలపడంతో వెనక్కు తగ్గారు. చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై!
ఈ పరిస్థితుల్లో తన అభిమానులు, మక్కల్ ఇయక్కం సభ్యులతో విజయ్ రెండురోజులుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దగ్గర అవుతుండడం సోమవారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా రజనీ, కమల్ పార్టీల గురించి, వారి ప్రభావం గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. కొందరు ఇతర పార్టీల వైపు వెళుతున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. తొందర పడోద్దని, ఉజ్వల భవిష్యత్తు మనకే అంటూ విజయ్ వారికి సూచించడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఈ క్రమంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు దళపతి సమాయత్తం అవుతారేమో అన్న చర్చ మొదలైంది.