పోడు పట్టాల పేరిట కేసీఆర్‌ చిచ్చు  | Sakshi
Sakshi News home page

పోడు పట్టాల పేరిట కేసీఆర్‌ చిచ్చు 

Published Sat, Nov 26 2022 2:31 AM

Telangana: YSRTP YS Sharmila Slams On CM KCR - Sakshi

ములుగు: పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి గిరిజనులు, అటవీ అధికారుల మధ్య చిచ్చు పెట్టిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర శుక్రవారం ములుగు జిల్లాలో కొనసాగింది. సాయంత్రం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.

గిరిజన మహిళల జుట్లు పట్టుకులాగే అరాచక, దుర్మార్గపు పాలన చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని ఆరోపించారు. కేసీఆర్‌ తన పాపాలను కప్పి పుచ్చుకోవడానికే రాష్ట్ర మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలో భాగంగా కేటాయించిన గిరిజన యూనివర్సిటీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు సరైన భోజనం పెట్టలేని సీఎం ఉంటే ఎంత.. లేకుంటే ఎంత.. అని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనను తీసుకొస్తానని షర్మిల హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement