
రైతు గోస ధర్నాలో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల
కల్లూరు రూరల్: ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం హనుమతండాలో శుక్రవారం రైతు గోస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా 70 ఏళ్లుగా తాము సాగు చేస్తున్న భూములకు ఇంత వరకు పట్టాలివ్వలేదని
గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని హనుమ తండా, లక్ష్మాతండా, గనియాతండాకు చెందిన గిరిజనులు తెలిపారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు పోడు రైతులకు పట్టాలిస్తానని.. తానే స్వయంగా వెళ్లి కుర్చీ వేసుకుని కూర్చుని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు.