
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల చావుల్లో కూడా తేడాలు చూస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. రైతు బీమా పేరుతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇస్తున్న పరిహారం కూడా వారికి సరిగా అందడం లేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఏడేళ్ల పాలనలో దాదాపు 7,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం కేవలం 1,600 మంది రైతు కుటుంబాలకే పరిహారం ఇచ్చిందని, మిగతా 6 వేల మంది రైతు కుటుంబాల పరిస్థితి ఏమిటని నిలదీశారు.
ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు సరైన సమయానికి ఇవ్వడం తెలిసిన కేసీఆర్ రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తున్నారని విమర్శించారు. వానాకాలం వడ్లు కొనుగోలులో జాప్యం చేయడంతోపాటు యాసంగి వరి పండించవద్దని కేసీఆర్ చెప్పడంతో తెచ్చిన అప్పులు కట్టలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర రైతాంగం ఒక్కటై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని షర్మిల స్పష్టం చేశారు.