YS Sharmila: 19 నుంచి రైతు ఆవేదన యాత్ర

Telangana: YSR Telangana Party Chief YS Sharmila Comments On CM KCR - Sakshi

ఆత్మహత్య చేసుకున్న ప్రతిరైతు ఇంటికి వెళ్తాం.. అండగా నిలబడతాం

టీఆర్‌ఎస్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం 

వైఎస్సార్‌ టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని, సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆరోపించారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాల యంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఇటు కమీషన్లు.. అటు రైతుల ప్రాణాలు తీసుకుంటున్న కేసీఆర్‌ ఆకలి ఎప్పుడు తీరుతుందో అని ప్రశ్నిం చారు. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఆయన పాపం పోదన్నారు.

వడ్లు అమ్ముడుపోక, అప్పులు ఎక్కువై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ఈ సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఏడేళ్లలో 7వేల మందికి పైగా రైతులు చనిపోయారని చెప్పారు. గత 70 రోజుల్లో 200 మందికి పైగా రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారంటే తెలంగాణలో అన్నదాత పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈ నెల 19 నుంచి రైతు ఆవేదన యాత్ర చేపడతామని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరి ఇంటికీ వెళ్తామని, ఆయా కుటుంబాలకు అండగా నిలబడతామన్నారు. రైతు ఆవేదనయాత్ర అనంతరం ప్రజాప్రస్థానం పాదయాత్ర, నిరుద్యోగ నిరాహార దీక్షలను కొనసాగిస్తామన్నారు.  

కమీషన్ల మీదున్న సోయి.. రైతులపై లేదు 
గజ్వేల్‌/వర్గల్‌: కోట్లకు కోట్లు కమీషన్లు దిగమింగుతున్నారని.. వాటి మీద ఉన్న సోయి రైతుల మీద లేదని కేసీఆర్‌ ప్రభుత్వం తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం దండుపల్లి గ్రామంలో ధరణి రికార్డుల్లో తన భూమి నమోదు కాలేదన్న బెంగతో ఆత్మహత్యకు పాల్పడిన చింతల స్వామి కుటుంబీకులను పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.

ఆత్మత్యకు దారితీసిన పరిస్థితులను అతని భార్య బాల్‌లక్ష్మీ, కుమారులు ప్రశాంత్, ప్రకాశ్‌తోపాటు తల్లిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. అక్కడి నుంచే వర్గల్‌ తహశీల్దార్‌కు ఫోన్‌ చేసి.. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top