యాసంగి ధాన్యం కొనాల్సిందే!

Telangana: TRS Protest Blocks NHs Highways Over Paddy Purchase - Sakshi

కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ రాస్తారోకోలు 

సాక్షి నెట్‌వర్క్‌: తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ మరోసారి డిమాండ్‌ చేసింది. లేకుంటే కేంద్రానికి రాస్తా బంద్‌ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్, విజయవాడ రహదారులపై రాస్తారోకోలు చేపట్టాయి. నేతలు, కార్యకర్తలు వరి కంకులు, ప్లకార్డులు చేపట్టి, రోడ్లపై ధాన్యం కుప్పపోసి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ వద్ద హైదరాబాద్‌–బెంగళూరు హైవే ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. ‘‘రైతుల కోసం కేంద్రం ఏం చేసిం దో బీజేపీ నేతలు గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి. పండించిన పంటనే కొనలేని దద్దమ్మ ప్రభుత్వం. అగ్రిమెంట్‌ రాసిచ్చారని ఒకరు.. కొంటమని మరొకరు.. కొనమని ఇంకొకరు.. నూకలు తినాలంటరు. నూకలు మేం తినం.. మీకు నూకలు చెల్లినయ్‌’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. పంజాబ్‌ తరహాలో తెలంగాణలో ధాన్యం కొనేదాకా ఊరుకోబోమన్నారు. ఇక్కడ గంటకుపైగా ఆందోళన సాగడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  

అడుగడుగునా నిరసనలతో.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రమావత్‌ రవీంద్రకుమార్‌ల ఆధ్వర్యంలో 65వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు.. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని పెద్దవూర మండల కేంద్రం లో ఎమ్మెల్యే నోముల భగత్‌.. సూర్యాపేట సమీపంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌.. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌లో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో రాస్తారోకోలు జరిగాయి. 

►యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ వద్ద, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు నిరసనలు చేపట్టారు. గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 
►నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కడ్తాల్‌ వైజంక్షన్‌ వద్ద 44వ జాతీయ రహదారిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో రాస్తారోకో చేశారు. 
►ఆదిలాబాద్‌ జిల్లా చాందా(టి) గ్రామ సమీపంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావ్‌ నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించారు. 
►సంగారెడ్డిలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, పద్మాదేవేందర్‌రెడ్డి, మాణిక్‌రావు, దేవీప్రసాద్‌రావు, చింతా ప్రభాకర్‌ తదితరులు రాస్తారోకోలో పాల్గొన్నారు. 
►మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో, పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.

నేడు జిల్లా కేంద్రాల్లో దీక్షలు 
టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, దీక్షలకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్టీ మండల కమిటీలు, అనుబంధ సంఘాల నేతలు దీక్షలకు రావాలని సూచించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top