హాట్‌ సీట్‌.. ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌! | Sakshi
Sakshi News home page

హాట్‌ సీట్‌.. ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌!

Published Sun, Nov 5 2023 7:31 PM

Telangana Politics Khammam Constituency - Sakshi

వారిద్దరూ పాత ప్రత్యర్థులే. ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. ఒకరు ప్రస్తుత మంత్రి, మరొకరు మాజీ మంత్రి. ఇప్పుడిద్దరూ ఖమ్మం అసెంబ్లీ సీటు కోసం పోటీ పడుతున్నారు. లోకల్‌గా ఓటర్లను ప్రభావితం చేయగల తమ సామాజికవర్గం మద్దతు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రి తను మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లి బాణాసంచా కాల్చారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఏకంగా టీడీపీ ఆఫీస్‌కు వెళ్ళి పచ్చ కండువా కప్పుకుని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. 

ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా..బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పటికే మాటలతూటాలు తారాస్థాయికి చేరాయి. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల 18 వేల ఓట్లు ఉండగా...ఇందులో 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా...ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారుతున్నాయి.

అటు గులాబీ పార్టీ..ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్‌ హాట్‌ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ కమలం పార్టీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేకపోవడంతో...బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడుతున్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్‌...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్‌ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడుతున్నారు. 

కమ్మ సామాజిక వర్గం ఓట్లు చేజారకుండా ఇద్దరు అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకుంగటున్నారు. ఏ ఒక్క అవకాశం దొరికినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కంటి చికిత్సకోసం లభించిన తాత్కాలిక బెయిల్ విషయంలో అదే జరిగింది. తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసినా...ఖమ్మంలోని కమ్మ నేతలు మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు తన పాత పార్టీ బాస్‌, తమ కుల నేత చంద్రబాబుకు బెయిల్‌ వచ్చినందుకు ఆయనకు సంఘీభావం తెలియచేయడానికి టిడిపి జిల్లా కార్యాలయంలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత ఆయన జిల్లాలోని టిడిపి కార్యాలయానికి ఎప్పుడూ రాలేదు. 

చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీకి తుమ్మలను ఆహ్వానించడంతో ఆయన అక్కడకు వెళ్ళారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు జై తుమ్మల అంటూ నినదిస్తూ కాంగ్రెస్‌ కండువా కప్పుకుని ఉన్న ఆయనకు టీడీపీ కండువా వేశారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ ఆఫీస్‌లోని ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది టీడీపీ కార్యాలయమే అని చెప్పారు. చంద్రబాబు తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చిన సందర్భంగా..టీడీపీ శ్రేణుల సంతోషంలో భాగస్వామిని కావాలని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇదే కేరింతలతో రానున్న 30 రోజులూ తన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని టీడీపీ శ్రేణులను కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. 


అటు బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సైతం చంద్రబాబు బెయిల్‌పై విడుదలైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్ బండ్ మీదున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. చంద్రబాబు బయటకు వచ్చారని ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తాను ఖండించినట్లు చెప్పుకున్నారు. రెండు సార్లు విజయం సాధించి..మూడోసారి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పువ్వాడ అజయ్‌ తన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పడం మానేసి.. చంద్రబాబు భజన చేయడంతో గులాబీ పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

పదేళ్ళ నాడు ఆరు వేల ఓట్ల తేడాతో పువ్వాడ ఆజయ్‌కుమార్‌ మీద ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఎలాగైనా ఆయన మీద గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అదవిధంగా తుమ్మలను మరోసారి ఓడించి..హ్యాట్రిక్ సాధిస్తానని పువ్వాడ చెబుతున్నారు. రెండు బలమైన పార్టీలు..ఇద్దరు పాత ప్రత్యర్థులు ఢీ అంటే ఢీ అంటుండటంతో ఖమ్మం నియోజకవర్గం హాట్‌ సీట్‌గా మారింది. ఇద్దరూ తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు...తమ సామాజికవర్గమైన కమ్మవారి మద్దతు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఖమ్మం ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాలి.

Advertisement
 
Advertisement