మునుగోడుకు దూరం

Telangana: Mp Komatireddy Venkat Reddy Says No To Munugodu Election Campaign - Sakshi

ఢిల్లీలో భేటీకి గైర్హాజరు..సోనియాగాంధీకి లేఖ  

రేవంత్‌రెడ్డి వైఖరి మనస్తాపాన్ని కలిగించింది..

కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తేనే తెలంగాణలో పార్టీ బతుకుతుంది 

మాణిక్యం ఠాగూర్‌ దొంగనాటకాలాడుతున్నారు 

సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్‌: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని ఝలక్‌ ఇచ్చారు. ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా ఎప్పుడూ పార్టీ అధిష్టానానికి సంపూర్ణ విధేయత ప్రకటించే ఆయన ఓరకంగా ధిక్కార స్వరాన్నే వినిపించారు. మునుగోడు ఉప ఎన్నికపై సోమవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో జరిగిన కీలక భేటీకి ఆయన గైర్హాజరు అయ్యారు. ఆ తర్వాత ఎందుకు హాజరు కాలేదో వివరిస్తూ సోనియాగాంధీకి లేఖ పంపారు. తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లలేనని అందులో స్పష్టం చేశారు.

పార్టీ లోని కొందరు తనను అవమానపరుస్తున్నారని, పార్టీ కోసం మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న తనలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వైఖరి తనకు మనస్తాపాన్ని కలిగించిదని పేర్కొన్నారు. కాగా సోనియాగాంధీకి కోమటిరెడ్డి రెండు లేఖలు పంపారని, ఒక లేఖ బహిర్గతం కాగా మరో లేఖను గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. బహిర్గతమైన లేఖలో రేవంత్‌ వైఖరి కారణంగా 
  పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వెంకట్‌రెడ్డి కూలంకషంగా వివరించారని సమాచారం. పార్టీలో పరిణామాలన్నీ అర్థమయ్యే విధంగా రాసిన ఈ లేఖలో.. తెలంగాణ పార్టీలో జరగాల్సిన అంతర్గత మార్పుల గురించి కూడా ఆయన డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. బహిర్గతమైన లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 

పార్టీకి విధేయుడిగానే కొనసాగుతాను కానీ.. 
‘ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తాను. అయితే కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో పార్టీలోని కొన్ని వర్గాలు కావాలని నన్ను అవమానించడంతో పాటు పనికట్టుకుని దాడులు చేస్తున్నాయి. గత మూడు దశాబ్దాలకు పైగా నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తున్న నన్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం మనస్తాపాన్ని కలిగిస్తోంది. పార్టీలో కొత్తగా చేరినప్పటికీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించారు. నేను పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆయనకు పూర్తి సహకారం అందించడంతో పాటు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. కానీ రేవంత్‌రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులు నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు.

రోజురోజుకూ నాపై పెరుగుతున్న ఈ దాడులు.. పార్టీపై తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. గతంలో ఆయన నాకు చెప్పిన క్షమాపణలను కూడా నేను అంగీకరించాను. కానీ మళ్లీ నాతో పాటు ఇతర  సీనియర్లను అవమానించడం వారికి పరిపాటిగా మారింది. నన్ను హోంగార్డులుతో పోల్చిన ఆయన తనకు తాను డైరెక్ట్‌ రిక్రూటీ ఐపీఎస్‌గా చెప్పుకున్నారు. నేను పార్టీ విధేయుడిగానే కొనసాగుతాను. కానీ నా పట్ల అవలంబిస్తున్న అవమానపూరిత వైఖరి కారణంగా నేను మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. ఈ సమావేశానికి రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.’ అని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.  

వాళ్లతోనే ప్రచారం చేయించుకోండి: కోమటిరెడ్డి 
ఢిల్లీలో భేటీకి గైర్హాజరై హైదరాబాద్‌ వచ్చిన కోమటిరెడ్డి శంషాబాద్‌ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాలకు పైగా పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వాళ్లను గుర్తించకుండా నాలుగు పార్టీలు మారిన వాళ్లకు పదవులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, తెలంగాణ కోసం కొట్లాడిన  తనలాంటి వారిని పట్టించుకోకుండా హడావుడి చేసే వాళ్లను గుర్తిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పార్టీ విషయంలో మాణిక్యం ఠాగూర్‌ దొంగనాటకాలాడుతున్నారని, పార్టీ కార్యకర్తలకు అవమానం జరుగుతోందని చెప్పారు.

 ఇలాంటి వైఖరి కారణంగానే తెలంగాణలో పార్టీ సర్వనాశనం అయిందని, దానికి ప్రతిఫలంగానే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో ప్రచారం చేసిన వాళ్లతోనే మునుగోడులోనూ ప్రచారం చేయించుకోవాలని అన్నారు. మాణిక్యం ఠాగూర్‌ను మార్చాలన్నారు. ఆయన స్థానంలో కమల్‌నాథ్‌ లాంటి నేతలను రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జులుగా పంపాలనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి వ్యక్తం చేశారు. మరోసారి పార్టీ నేతలందరి అభిప్రాయాలను తీసుకుని కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తేనే తెలంగాణలో పార్టీ బతుకుతుందని స్పష్టం చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top