కాళేశ్వరం లిఫ్టుల్లో పారేది డబ్బే 

Telangana: Minister Nirmala Sitharaman Allegations Over Kaleshwaram Project - Sakshi

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపణ 

ప్రాజెక్టుల కోసం భూములిచ్చినవారికి పరిహారం ఇవ్వడం లేదు 

కాళేశ్వరం నిర్మాణ వ్యయాన్ని మూడింతలు పెంచారు 

రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది నాలుగో స్థానం 

బడ్జెట్‌తో సంబంధం లేకుండా అప్పులు చేస్తూ ప్రజలపై భారం 

సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారమి వ్వని తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మూడింతలు పెంచుకుందని, లిఫ్టుల్లో నీళ్లకు బదులు డబ్బు పారిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. కాళేశ్వరం సహా మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, సీతారామసాగర్, పాలమూరు–రంగారెడ్డి, కిష్టంపల్లి, నక్కలగూడెం వంటి ప్రాజెక్టులకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు ఎందుకు పరిహారం చెల్లి ంచలేదని ప్రశ్నించారు. జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవాసీ యోజన్‌లో భాగంగా.. జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించేందుకు నిర్మలా సీతారామన్‌ గురువారం కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. 

వ్యయం ఎందుకు పెరిగిందో చెప్పాలి 
‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం, దాన్ని రూ.లక్షా 20 వేల కోట్లకు ఎందుకు పెంచిందో సమాధానం ఇవ్వాలి. సాధారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతుంది. అయితే కాళేశ్వరం త్వరగా పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతోంది. మరి త్వరగా పూర్తయినపుడు నిర్మాణ వ్యయం మూడింతలు ఎందుకు పెరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలి..’అని మంత్రి డిమాండ్‌ చేశారు.  

91.7 శాతం మంది రైతులు అప్పుల్లో.. 
‘రైతు ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని ఇటీవలి నివేదికల్లో వెల్లడైంది. రైతులకు రుణ మాఫీ చేయరు. ప్రాజెక్టులకు కింద మునిగిపోయిన భూములకు పరిహారం ఇవ్వరు. పంటలు దెబ్బతిన్నపుడు రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రధానమంత్రి ఫసల్‌ బీమాను తీసుకువస్తే అమలు చేయరు. కానీ రైతులకు అన్నీ చేస్తున్నామని అంటున్నారు. అన్నీ చేస్తుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు అప్పుల్లో మునిగిపోయారు? 91.7 శాతం మంది రైతులు అప్పుల్లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి..’అని నిర్మలా సీతారామన్‌ ధ్వజమెత్తారు.  

పుట్టబోయే బిడ్డపై లక్షా 25 వేల అప్పు 
‘మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ప్రభుత్వం అప్పుల పాలు చేస్తోంది. ఏ ప్రభుత్వమైనా బడ్జెట్‌లో పొందుపర్చిన విధంగా ఆదాయ, వ్యయాల లెక్కలుంటా యి. ఆదాయం ఎంత ? వాగ్దానాలు అమలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ? ఎంత అప్పు చేస్తున్నామన్న విషయాలను ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపర్చి అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారమే అప్పులు తీసుకో వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌కు సంబంధం లేకుండా, ఎఫ్‌ఆర్‌బీఎంకు మించి అప్పులు చేస్తోంది. ప్రజలపై భారం మోపుతూ ఇబ్బంది పెడుతోంది. మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డపై రూ.లక్షా 25 వేల అప్పు ఉందని గతంలోనే చెప్పారు..’అని విమర్శించారు.  

కేంద్ర పథకాలకు సొంత పేర్లు  
‘కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా పథకాలను తీసుకువచ్చి దేశమంతా అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆ పథకాల పేర్లను మార్చి, నిధులను వాడుకుంటూ తమ పథకాలుగా చెప్పుకుంటోంది. పీఎం ఆవాస్‌ యోజన పథకాన్ని కేంద్రం తీసుకువస్తే, దాన్ని డబుల్‌ బెడ్‌రూం పథకం అంటూ పేరు మార్చుకుంది. పీఎం మత్స్యసంపద యోజన కింద నిధులిస్తే దాన్ని కూడా మార్చింది. గొర్రెల పెంపకానికి నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ నుంచి కేంద్రం డబ్బులిస్తే, ప్రభుత్వం దాన్ని గొర్రెల పంపిణీ పథకంగా మార్చుకుంది. మరోవైపు కేంద్రం సహకరించడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది..’అని ధ్వజమెత్తారు.  

రాష్ట్రాన్ని పట్టించుకోకుండా దేశం తిరుగుతున్నారు 
‘కేంద్రం ఇస్తున్న ప్రతి పైసా అర్హులకు అందాలన్నదే ప్రధాని మోదీ సంకల్పం. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తున్నారు..’అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశం అంతా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బిహార్‌కు వెళ్లి ఏదేదో మాట్లాడుతుంటే అక్కడి సీఎం లేచి నిలబడి ఇక చాలంటూ వారించారని విమర్శించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top