మేము ఆకాశమంత ఎత్తులో ఉన్నాం.. బొక్క బోర్లా పడింది మీరే’

Telangana Minister Harish Rao Takes On BJP - Sakshi

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శలను తిప్పికొట్టిన మంత్రి హరీశ్‌రావు 

హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోయి బోర్లా పడిందని ఎద్దేవా

మునుగోడులో ఓడినా బీజేపీకి బుద్ధిరాలేదని చురక

కోట్ల కొద్దీ కొలువులు.. లక్షల కొద్దీ డబ్బు ఎక్కడని ప్రశ్నించిన మంత్రి  

సాక్షి, హైదరాబాద్‌: ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు.. అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీని ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చీరాని భాషలో అవహేళనగా మాట్లాడుతున్నారు. ఉట్టికే కాదు అన్ని విషయాల్లో బీజేపీ కంటే ఆకాశమంత ఎత్తులో ఉన్నాం. అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉండగా, దేశం మాత్రం వెనకబడి ఉంది’అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

కరీంనగర్‌ సభలో బీజేపీ తన నయవంచనను ప్రదర్శించిందని, సీఎం కేసీఆర్‌ ప్రతీ నిమిషం ప్రజల కోసం ఆలోచిస్తే, బీజేపీ గోతు లు ఎలా తీయాలో చూస్తోందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన బీఆర్‌ఎస్‌ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. వెన్నుపోట్లు, ఆపద మొక్కు లు బీజేపీకి మాత్రమే తెలుసని, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోయి బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. సాలుదొరా అంటూ చిల్లరమాటలు మాట్లాడుతున్నారని, మునుగోడు తీర్పుతో కూడా ఆ పార్టీకి బుద్ధి రాలేదన్నారు.  

పథకాలు మావి... పబ్లిసిటీ మీదా..?
బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ అంటూ ప్రాస కోసం పాకులాడుతున్న నడ్డాకు వీఆర్‌ఎస్‌ అంటే అర్థం తెలియదని హరీశ్‌రావు విమర్శించారు. కోట్ల కొద్దీ కొలువులు ఇస్తాం, లక్షల కొద్దీ డబ్బు ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పిన బీజేపీ, రూపాయి విలువను అధఃపాతాళానికి నెట్టివేసిందని మండిపడ్డారు. రైతుబంధు, మిషన్‌ భగీరథ వంటి పథకాలను బీజేపీ నేతలు కాపీ కొట్టారని, పథకాలు మావి.. పబ్లిసిటీ మీదా.. అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు అవార్డురాని రంగం లేదని, నడ్డా పార్టీవన్నీ నకిలీ పథకాలని అన్నారు.

ఢిల్లీలో రాష్ట్రానికి అవార్డులు ఇస్తూ.. బీజేపీ గల్లీలో విమర్శలు చేస్తోందన్నారు. ‘మా భాష బలహీనమైనా మేము పనిమంతులం, నిజాయితీపరులం.. కానీ బలహీన బీజేపీ బలహీన భారతాన్ని తయారు చేసింది’అని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల వల్లే ఉద్యోగుల వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని, జీఎస్‌టీ నష్టపరిహారం తెలంగాణకు చాలా పరిమితంగా వచ్చిందని వివరించారు. నెలకు లక్ష కోట్ల రూపాయల అప్పు చేస్తున్న ఘనత మోదీ సర్కారుకే దక్కుతుందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎందుకు పెరగడం లేదో నడ్డా చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో గుజరాత్‌ ఉద్యోగుల వేతనాలు పోల్చుతూ త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని హరీశ్‌ వెల్లడించారు.  

నిధుల వరద పారించండి 
దేశాన్ని బీజేపీ సర్కార్‌ అప్పుల కుప్పగా మార్చిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణకు బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రీరామ రక్ష అని, భవిష్యత్తులో బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని ఉపన్యాసాలు ఇవ్వాలని ఆయన హితవు పలికారు. తెలంగాణపై విమర్శలు చేస్తున్న నేతలు గుజరాత్‌ తరహాలో రాష్ట్రానికి కూడా నిధుల వరద పారించి ప్రజాభిమానం చూరగొనాలని సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top