ఓట్ల కోసం ఏదైనా చేస్తారు 

Telangana Minister Harish rao Lashes Out BJP Party - Sakshi

బీజేపీపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం 

గోవును పూజించేది మేము.. రాజకీయాలకు వాడుతూ మలినం చేసేది బీజేపీయేని విమర్శ 

సాక్షి, సిద్దిపేట: ‘గోవును, గుడిలో భగవంతున్ని పూజించేది మేము.. కానీ రాజకీయాలకు వాడుకుని మలినం చేసే చరిత్ర బీజేపీది’అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బీజేపీపై ధ్వజమెత్తారు. ఓట్ల కోసం బీజేపీ వాళ్లు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ  మంత్రి నిరంజన్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌లతో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పండి అని ప్రశ్నించారు. ధరలు పెంచడం తప్ప ఎవరికి ఏం చేశారని నిలదీశారు. జన్‌ ధన్‌ యోజన ద్వారా డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి వేయలేదన్నారు. కోట్ల కొలువులు ఇస్తా మని ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ప్రభు త్వ రంగ సంస్థలు అమ్మడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని హరీశ్‌ ధీమా వ్యక్తం చేశారు. 

మిషన్‌ 90 సీట్లు కాదు: నిరంజన్‌రెడ్డి  
మిషన్‌ 90 సీట్ల పేరుతో తెలంగాణలో 90 స్థానాలు గెలుస్తామని ఓ బీజేపీ నాయకుడు అన్నాడని, వాళ్లు మొదటగా 90 మంది అభ్యర్థులను పెట్టుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికష్టాలొచ్చినా సీఎం కేసీఆర్‌ రైతుబంధు ఆపలేదని, 10వ విడతలో ఇప్పటికే 42 లక్షల ఎకరాలకు రైతుబంధు వచ్చిందని.. అలాంటి కేసీఆర్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. 

బీజేపీకి చెందిన వ్యక్తికి చెక్కు ఆపేశా..: ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి 
ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో బీజేపీకి చెందిన వ్యక్తికి ఇవ్వాల్సిన చెక్కును ఆపేశానని చెప్పారు. ’’ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెక్కు రాలేదని అడిగాడు.. ఇంట్లో రెండు ఫించన్లు ఇస్తున్నా కల్యాణలక్ష్మి చెక్కు ఎందుకు..ఇంకా బీజేపీలో ఎందుకు ఉన్నావ్‌ ’’అని అడిగానని బాజిరెడ్డి తెలిపారు.

గవర్నమెంట్‌ పథకాలు తీసుకుంటూ బీజేపీలో ఉండటం ఏంటని ప్రశ్నించానని చెప్పా రు. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతూ.. ఇక్కడ మాదిరిగానే మా దగ్గర సైతం ఓ గుండు గాడు ఉన్నాడని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. ’’బీజేపీ వాళ్లు జై శ్రీరామ్‌ అని అంటున్నారు.. మోదీకి భార్య లేదు కాబట్టి శ్రీరాముని భార్య సీతను కూడా విడదీస్తారా.. జై సీతారామ అనాలి’’అని బాజిరెడ్డి 
వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top