సీఎం కుటుంబం కోసమే పథకాలు

Telangana: Kishan Reddy Hits Out At TRS Govt - Sakshi

రాష్ట్ర శ్రేయస్సు కోసం కాదు.. 

రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా కయ్యం పెట్టుకుంటోంది

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై కేంద్ర పర్యాటక  మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ ప్రవేశపెడుతున్న పథకాలు, బడ్జెట్లు.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రయోజనాలు, రాజకీయాల కోసం తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోసం కాదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను వారు పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఆదివారం పార్టీ నేతలు రామచందర్‌ రావు, కృష్ణసాగర్, చింతల రామచంద్రరెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 

లేఖ రాసినా స్పందన లేదు 
‘రాష్ట్రానికి వైజ్ఞానిక కేంద్రం మంజూరు చేశామని, ఇందుకోసం 25 ఎకరాల భూమి కావాలని నేను స్వయంగా సీఎంకు లేఖ రాశా. అధికారులూ లేఖ రాశారు. అయినా స్పందన లేదు. కొమురం భీం పేరిట మ్యూజియం ఏర్పాటు కోసం కేంద్రం ముందుకు వచ్చి రూ.18 కోట్లు మంజూరు చేసి, కోటి రూపాయలు విడుదల చేసినా రాష్ట్రం సహకరించడం లేదు. టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం స్థలం ఇవ్వడంపై కూడా అతీగతీ లేదు.

ఘటకేసర్‌ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు మార్గం వేయడానికి సిద్ధంగా ఉన్నా.. రాష్ట్రం భూమి సేకరించి ఇవ్వడం లేదు..’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పారు. కేంద్రం ఎంత సహకరిస్తున్నా రాష్ట్రం మాత్రం కయ్యం పెట్టుకుంటోందని విమర్శించారు. రాష్ట్రం భూమి సేకరించి ఇస్తే కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు రైలు మార్గం వేయడానికి సిద్ధమని చెప్పారు.  

ముడిబియ్యం ఎంతైనా కొంటాం.. 
ఉప్పుడు బియ్యానికి దేశంలో ఎక్కడా డిమాండ్‌ లేదని..అందుకే కేంద్రం కొనలేకపోతోందని కేంద్రమంత్రి తెలిపారు. ముడి బియ్యం ఎంతైనా కొనడానికి సిద్ధమని చెప్పారు. ఉప్పుడు బియ్యం విషయంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉంటుందని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లోని ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉప్పుడు బియ్యం, మోదీ బియ్యం నిల్వలు ఉన్నాయని తెలిపారు.  

పురాతన కట్టడాల పరిరక్షణకు కఠిన చట్టం 
చారిత్రక, పురాతన కట్టడాలను ఆక్రమణల నుంచి రక్షించడానికి, అటవీ చట్టాల మాదిరి కఠిన చట్టాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తీసుకొస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పురాతత్వ శాఖ ఆధీనంలోని శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ ఆలయాభివృద్ధికి రూ.40 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 31న ఈ ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు.

భద్రాచలం టూరిజం సర్క్యూట్‌ను కేంద్రం మంజూరు చేసినట్లు, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో రూ.50 కోట్ల తో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామ న్నారు. వరంగల్‌ లోని వెయ్యి స్తంభాల మండపాన్ని రాతి కట్టడంగా పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. గోల్కొండ కోటలో ప్రస్తుతం ఉన్న సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను ఆధునీకరిస్తామని చెప్పారు. దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నిం టినీ ఒకేసారి సందర్శించడానికి వీలుగా ‘దేఖో అప్నా దేశ్‌’ పేరిట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top