టీఆర్‌ఎస్‌ గెలిస్తే రాష్ట్రం తాకట్టు

Telangana BJP President Bandi Sanjay Slams On CM KCR Over Munugode Bypoll - Sakshi

పథకాలతో ఓటర్లను బుట్టలో వేసుకొనేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు 

గ్రామాల్లో బెల్టు షాపులు పెట్టించి గౌడకులస్తుల వృత్తి నిర్వీర్యానికి సీఎం కుట్రపన్నారు 

మునుగోడులో యాదవులకు గొర్రెల పథకం నిధులిచ్చినట్లే ఇచ్చి స్తంభింపజేశారు 

చండూరు రోడ్‌ షోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపణలు 

చండూరు, మునుగోడు: ప్రాజెక్టులు, పథకాల పేరు తో రూ. లక్షల కోట్లు దోచుకున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపిస్తే సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని తాకట్టు పెడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. 2014కు ముందు సీఎం కేసీఆర్‌ బ్యాంకు రుణం తీసుకొని కొనుగోలు చేసిన కారు, పార్టీ ప్రచార రథానికి వాయిదాలు చెల్లించకపోతే బ్యాంకు అధికారులు వాటిని తీసుకువెళ్లా రని... అలాంటి కేసీఆర్‌ సీఎం పదవి లభించాక రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసి నేడు రూ. 100 కోట్లతో విమానం కొనుగోలు చేస్తున్నారన్నారు.

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఆపార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్, ఎన్నికల సమన్వయకర్త సునీల్‌ బన్సల్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలసి నల్లగొండ జిల్లా చండూరులో నిర్వహించిన రోడ్‌ షోలో సంజయ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నికలు వచ్చినా అక్కడ గెలిచేందుకు అభివృద్ధి పనులకు నిధులు, దళితబంధు, ఇతర పథకాలతో ఓటర్లని బుట్టలో వేసుకొనేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని సంజయ్‌ మండిపడ్డారు.

అందులో భాగంగానే నియోజక వర్గంలోని యాదవులకు గొర్రెల పంపిణీ పథకం కింద ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 1.54 లక్షలు జమ చేశారన్నారు. అయితే లబ్ధిదారులు డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా ఆ సొమ్మును స్తంభింపజేశారని... ఎన్నికలు పూర్తయ్యాక నిధులను వెనక్కి తీసుకొనే కుట్రలు చేస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. గౌడ కులస్తుల వృత్తిని నిర్వీర్యం చేసేందుకు గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు పెట్టించి కల్లు తాగేవారు లేకుండా సీఎం కుట్రలు పనుతున్నారని సంజయ్‌ ఆరోపించారు. నవంబర్‌ 3న జరిగే ఉపఎన్నికలో బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో  గెలిపించాలని సంజయ్‌ కోరారు. 

ఓటుకు రూ.లక్ష ఇచ్చినా బీజేపీదే గెలుపు...
సీఎం కేసీఆర్‌ మునుగోడులో గెలిచేందుకు ఓటుకు రూ. లక్ష ఇచ్చినా గెలిచేది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డేనని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతోనే గట్టుప్పల్‌ మండలం ఏర్పడిందని, యాదవులకు గొర్రెల పంపిణీ, ఆసరా పెన్షన్లు, రోడ్ల మరమ్మతులకు నిధులను కేసీఆర్‌ మంజూరు చేశారని చెప్పారు.

రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలనకు మునుగోడు ఉప ఎన్నికతో చరమగీతం పాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఆ పార్టీ నేతలు వివేక్‌ వెంకటస్వామి, గంగిడి మనోహర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top