ప్రజలు ఏసీడీ చార్జీలు చెల్లించొద్దు

Telangana: BJP Chief Bandi Sanjay Sensational Comments On CM KCR - Sakshi

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీయండి 

రైతు ఆత్మహత్యల్లో నాలుగవ స్థానంలో రాష్ట్రం  

వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఉట్టిమాటే  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  

కరీంనగర్‌టౌన్‌: రాష్ట్ర ప్రజలు విద్యుత్‌ ఏసీడీ చార్జీలు చెల్లించవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఏసీడీ చార్జీలు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలంతా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ‘మన్‌ కీ బాత్‌’కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని పేర్కొన్నారు.

అయితే రైతుల ఆత్మహత్యలే లేవని కేసీఆర్‌ చెప్పడం సిగ్గు చేటన్నారు. రైతులను ఎమ్మెల్యేలుగా చేస్తానంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. దళితుడిని సీఎంగా చేయడం ఎంత నిజమో, రైతులను ఎమ్మెల్యేలను చేస్తాననడం కూడా అంతే నిజం అని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లేవాళ్లంతా ప్రీ పెయిడ్‌.. పోస్ట్‌ పెయిడ్‌ నాయకులేనని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు.

నిరూపించకపోతే కేసీఆర్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటా నీటినే వాడుకోవడం చేతగాని కేసీఆర్, దేశం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. కేసీఆర్‌ రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్కో కుటుంబంపై సగటున రూ.6 లక్షల అప్పు భారం మోపారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా ఇటీవల హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీలో కోవర్టులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు బండి సంజయ్‌ని ప్రశ్నించగా.. ‘బీజేపీలో కోవర్టులెవరూ లేరు.. ఈటల అలా అన్నారనే విషయమే నాకు తెలియదు. ఆయన ఆ మాట అనలేదనే అనుకుంటున్నా. ఇతర విషయాలు మాట్లాడిన సందర్భంగా మీడియా వక్రీకరించి ఉండొచ్చు’అని సమాధానం ఇచ్చారు. మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌ మరణం బాధాకరమని అన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్, నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, బాస సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

పోరాడితే తప్ప స్పందించని నియంత ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షల్లో మల్టిపుల్‌ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది బీజేవైఎం కార్యకర్తల, ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల పోరాట విజయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల అమలు కోసం పోరాడితే తప్ప స్పందించని నియంత ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగడం దురదృష్టకరమని మండిపడ్డారు.

317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోస్టింగులివ్వాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లున్న స్కూల్‌ అసిస్టెంట్లకు మాత్రమే స్పౌజ్‌ బదిలీలను వర్తింపజేయడం అన్యాయమన్నారు. స్కూల్‌ అసిస్టెంట్లతోపాటు ఎస్జీటీ టీచర్లకు స్పౌజ్‌ బదిలీల్లో అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top