మరో ఉద్యమానికి సిద్ధం కావాలి 

Telangana: BJP Chief Bandi Sanjay Lashes Out CM KCR On Praja Sangrama Yatra - Sakshi

ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ పిలుపు 

తెలంగాణను ఆకలిచావులు, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిండ్రు 

కేసీఆర్‌ కుటుంబాన్ని తరిమికొట్టేందుకు తెలంగాణ తరహా ఉద్యమం  

నిర్మల్‌: ‘‘ఒకరు కాదు, ఇద్దరు కాదు శ్రీకాంతాచారి లాంటి 1,400 మంది పేదలు, విద్యార్థులు, యువత బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో పాలకుల తీరుతో స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆకలిచావులు, ఆత్మహత్యలు ఆగలేదు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ధనిక రాష్ట్రాన్ని ఆత్మహత్యల రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌ కుటుంబాన్ని తరిమికొట్టేందుకు తెలంగాణ తరహాలో మరో మహోద్యమానికి సిద్ధం కావాలి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి)మండలం రాంపూర్‌ నుంచి దిలావర్‌పూర్‌ మీదుగా నిర్మల్‌రూరల్‌ మండలం చిట్యాల వరకు శనివారం సాగింది. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దిలావర్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలలోని భవిత కేంద్రంలో దివ్యాంగులైన చిన్నారులతో ఆయన కాసేపు ఆడిపాడారు. వారికి బ్యాగులు, పెన్నులు, బిస్కెట్లు అందించారు. సభాస్థలి వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళుర్పించారు. 

ఆకలిచావులు, ఆత్మహత్యల రాష్ట్రంగా.. 
అరవై ఏళ్ల ఆకాంక్ష నెరవేరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా.. కేసీఆర్‌ పాలనతో ప్రజలకు ఎలాంటి లబ్ధి జరగలేదని సంజయ్‌ విమర్శించారు. డబుల్‌బెడ్రూం ఇళ్లు రాలేదని, ఆత్మహత్యలు ఆగలేదని, ఇప్పటికీ ఆకలిచావులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దిలావర్‌పూర్‌ మండల కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులు బికారీలుగా అవుతుంటే, కేసీఆర్‌ మాత్రం కోటీశ్వరుడు ఎలా అవుతున్నారని నిలదీశారు. ఫామ్‌హౌస్‌లో ఏమైనా గంజాయి పండిస్తున్నారా అని ఎద్దేవా చేశారు.  

మేకప్‌ వేసుకున్నావా అని భార్య ఆరా.. 
‘‘న్యూస్‌ చానళ్లలో పాదయాత్రను చూసి నా భార్య ఫోన్‌ చేసింది. ఏంది.. మేకప్‌ బాగా వేసుకున్నావా అని అడిగింది. పిచ్చిదానా.. అది మేకప్‌ కాదు.. కేసీఆర్‌ పాలనలో రోడ్లమీద ఉచితంగా వచ్చే దుమ్ము ఇట్ల చేసింది’’అని చెప్పానంటూ స్థానికంగా రోడ్లు, దుమ్ముపై సంజయ్‌ చెప్పిన తీరు సభికులను నవ్వించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top