బీజేపీ యాత్రతో కేసీఆర్‌లో వణుకు 

Telangana BJP Chief Bandi Sanjay Lashes Out CM KCR - Sakshi

అందుకే అడ్డుకోవాలనే కుట్ర: బండి సంజయ్‌

నిర్మల్‌: ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు బీజేపీ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో సీఎం కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుడుతోందని, అందుకే అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ప్రజల కష్టాలను గాలికి వదిలేసి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. పేదలను కలిసి భరోసా కల్పించేందుకే తాము పాదయాత్ర చేపట్టామని చెప్పారు. బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలం అడెల్లి నుంచి ప్రారంభించారు. 

భైంసా నుంచి ప్రారంభించాల్సి ఉన్నా.. 
వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం సంజయ్‌ అడెల్లి పోచమ్మ ఆలయంలో పూజలు చేసి, భైంసా బహిరంగసభలో పాల్గొని పాదయాత్ర ప్రారంభించాలి. కానీ ఆదివారం రాత్రి భైంసా వస్తున్న బండి సంజయ్‌ను అడ్డుకుని కరీంనగర్‌కు తరలించడంతో సభ వాయిదా పడింది. భైంసా సభ, పాదయాత్రలకు హైకోర్టు సోమవారం మధ్యాహ్నం షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో.. బండి సంజయ్‌ కరీంనగర్‌ నుంచి బయల్దేరి సాయంత్రానికి అడెల్లికి చేరుకున్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి అడెల్లి పోచమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభించారు. సారంగపూర్, నిర్మల్‌ మీదుగా భైంసా మండలం గుండెగాంకు చేరుకుని బస చేశారు. 

ఎవరివల్ల సున్నిత ప్రాంతమైంది? 
పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్‌ మాజీ జిల్లా అధ్యక్షుడు రామారావు పటేల్‌కు బండి సంజయ్‌ కాషాయ కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతున్నందునే కుంటిసాకులు చెప్పి పాదయాత్రను అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. భైంసా ఎవరి వల్ల సున్నిత ప్రాంతంగా మారిందని ప్రశ్నించారు.

పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే.. హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందామన్నారు. కోర్టు ఆదేశాలకు లోబడి పాదయాత్రను, బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయని, కేసీఆర్‌ హామీలేవీ నెరవేర్చలేదని బండి సంజయ్‌ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం హామీని నెరవేరుస్తామన్నారు. 

మహిళపై పెట్రోల్‌తో దాడి చేయడమేంటి? 
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల బస్సు (కారవాన్‌)ను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తగలబెట్టడాన్ని బండి సంజయ్‌ ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నదే కేసీఆర్‌ అండ్‌ బ్యాచ్‌ అని వ్యాఖ్యానించారు. ఒక మహిళ అని కూడా చూడకుండా షర్మిలను అరెస్టు చేయడం, ఆమె వాహనాన్ని తగలబెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top