టీడీపీపై నమ్మకం లేకే ఈ రాజకీయ డ్రామానా? | Sakshi
Sakshi News home page

టీడీపీపై నమ్మకం లేకే ఈ రాజకీయ డ్రామానా?

Published Tue, Jan 30 2024 11:54 AM

TDP MP Galla Jayadev Took A Sensational Decision - Sakshi

గుంటూరు తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ మాటల్లో నిజాయితీ కనిపిస్తోందా? ఆయన నిజమే చెబుతున్నారా?వచ్చే ఎన్నికలలో గెలవలేనన్న భయంతో మాట్లాడుతున్నారా? ఆయన ఇంతకీ వ్యాపారం కోసం రాజకీయాల నుంచి తప్పుకున్నారా? లేక కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయన్న ఆరోపణతో  తప్పుకున్నారా?పరస్పర విరుద్దంగా  రెండు మాటలూ ఆయనే మాట్లాడుతున్నారు.ఆయన మొత్తం మీద చూస్తే ,తాను ధైర్యవంతుడనని చెప్పుకుంటూ ,పిరికితనంతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది.

 రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారటకాని, తెలుగుదేశంకు రాజీనామా చేయడం లేదట. ఇంతకీ ఆయన ఏమి చెప్పదలిచారు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లతో ఏర్పడిన బలమైన రహస్య బంధాన్ని వదలుకోలేకపోతున్నారన్న విషయం అర్ధం అవుతుంది. ప్రత్యేక హోదా కోసం పోరాడాను కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన సంస్థలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసిందని ఆయన అన్నారు. అనుమతులు ఉన్నా కేసులు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై నింద మోపారు.

ఆయనలో చిత్తశుద్ది ఉంటే పూర్తి వివరాలు వెల్లడించి ఉండేవారు. తన సంస్థలలో ఈడి సోదాలు చేసినప్పుడు ,విచారణకు పిలిచినప్పుడు ఏమి జరిగింది? ఏ అంశాలలో ఆరోపణలు వచ్చాయి అన్న విషయాలపై ఎందుకు వివరణ ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ నేతలు కొందరు చెబుతున్నదాని ప్రకారం ఆయన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు సాయం చేసేందుకు చంద్రబాబు తరపున వందదల కోట్ల రూపాయల పంపిచారట.ఇందులో నిజం ఉందో లేదో తెలియదు. ఆ నేపద్యంలోనే ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆయన సంస్థలపై దాడులు చేసిందన్నది వారి అబియోగం.

చంద్రబాబు నాయుడు గత టరమ్ లో అధికారంలో  ఉన్నప్పుడు  కాంగ్రెస్ తో  సంబంధాలు పెట్టుకుని ఆ పార్టీకి  ఆయా రాష్ట్రాలలో ఆర్ధిక వనరులు సమకూర్చారని ప్రచారం జరిగింది. రాజస్తాన్ లో అప్పట్లో అశోక్ గెహ్లాట్ కు నిధులు సమకూర్చారన్న టాక్ కూడా వచ్చింది. అలాగే కర్నాటక ఎన్నికలలో కూడా తన వంతు పాత్ర పోషించారని అంటారు. అందువల్ల వైఎస్సార్‌సీపీ నేతల ఆరోపణలలో నిజం ఉండే అవకాశం లేకపోలేదు.కేవలం ప్రత్యేక హోదా అంశంపైన  జయదేవ్ పార్లమెంటులో మాట్లాడిన దానికే ఎలాంటి కనీసం సమాచారం  లేకుండా ఒక కంపెనీపై ఈడి దాడులు చేస్తుందా? అన్న ప్రశ్న వస్తుంది.

 అలా జరగకూడదని లేదు కాని, ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు కదా!వారిలో కొందరికి సొంత కంపెనీలు ఉన్నాయి కదా!వారిపై కూడా దాడులు జరిగాయా?అలాగే టీడీపీలో మరికొందరు ఎంపీలకు కూడా పరిశ్రమలు ఉన్నాయి.వారిపై ఎందుకు దాడులు జరగలేదు?అనంతపురం టీడీపీ ఎంపీగా జెసి దివాకరరెడ్డి 2014లో ఎన్నికయ్యారు.ఆయన కుటుంబానికి సంబంధించి బస్ ల లావాదేవీలపై పలు ఆరోపణలు  ఉన్నాయి.

కాని వారిమీద అప్పట్లో ఎందుకు ఈడి దాడి జరగలేదు? అవన్ని ఎందుకు!టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పై ఎన్నిసార్లు  మాట మార్చారు? ఆయన హోదా వద్దు..ప్రత్యేక  ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు గల్లా జయదేవ్ నోరు విప్పలేదే! అంటే ఈ అంశంపై జయదేవ్ కు ఉన్న  చిత్తశుద్ది ఇదేనా?చంద్రబాబు ప్రధాని మోడీపై పలుమార్లు వ్యక్తిగత విమర్శలు చేసినా, ఆయన భార్య గురించి మాట్లాడినా ఈడి దాడులు ఎందుకు చేయలేదో కూడా గల్లా చెబితే బాగుంటుంది. 

చంద్రబాబు పిఎస్ పై ఐటి శాఖ దాడి చేసి రెండువేల కోట్ల అక్రమాలు  కనుగొన్నా, ఇన్నేళ్లుగా ఒక్క అడుగు ముందుకు ఎందుకు పడలేదో కూడా ఆయన చెబుతారా? అవిశ్వాస తీర్మానంపైన లోక్ సభలో మాట్లాడితేనే కేసులు వచ్చేస్తే, ప్రతిపక్షంలో ఉన్న ఎంపీలలో చాలామందిపై కేసులు రావాలి కదా! మొత్తం మీద గల్లా జజయదేవ్ ఏదో దాస్తున్నట్లుగా ఉంది. 

ఇక రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు కూడా అసంబధ్దంగా ఉన్నాయి.అమరరాజా బాటరీ పరిశ్రమ నుంచి కాలుష్యం విడుదలై స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తోందని నివేదికలు చెప్పింది వాస్తవం కాదా? దానిపై ఆయన హైకోర్టుకు వెళ్లినా కాలుష్యం విషయంలో నిబంధనలు పాటించాలని చెప్పిందా? లేదా? ఆ సంగతి వెల్లడించకుండా వేధించారని తప్పుడు ఆరోపణ చేయడం సరైనదేనా? రాజకీయ నాయకుల పరిశ్రమల జోలికి వెళ్లరాదని గల్లా జయదేవ్ పార్లమెంటులో బిల్లు పెట్టి ఉంటే బాగుండేది.

ఒకవైపు పరిశ్రమ విస్తరణకు, వ్యాపారాభివృద్దికి గాను రాజకీయాలకు దూరం అవుతానని చెబుతూ,మరోవైపు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరోపణలు చేసి అందువల్లే తప్పుకుంటున్నట్లు చెప్పడంలో అర్ధం ఏమైనా ఉంటుందా? ఏపీలో పరిశ్రమ విస్తరణకు జయదేవ్ ప్రయత్నించారా? అలా చేసినా అనుమతులు రాలేదా? లేక తెలంగాణలో విస్తరించాలన్న ఉద్దేశంతో అక్కడ ప్రతిపాదించారా? అదే  టైమ్ లో ఏపీలో 250 కోట్ల పెట్టుబడులు పెడుతున్నానని  జయదేవ్ ఆ రోజుల్లో చెప్పరా? లేదా? తెలంగాణతో పాటు యుపి , పశ్చిమాసియా దేశాలలో కూడా కంపెనీలు పెడుతున్నామని చెప్పేవారు ఏపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేయవలసిన అవసరం ఏముంది? పోనీ తెలుగుదేశం 2014-2019 వరకు అధికారంలోనే ఉంది కదా!చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! అప్పుడు ఎందుకు ఒక్క రూపాయి కూడా ఏపీలో కొత్త పెట్టుబడులు పెట్టలేదు? అంటే  అప్పుడు కూడా వేధింపులే వచ్చాయని అనుకోవాలా? మీ వ్యాపారం మీ ఇష్టం.

కాని దిక్కుమాలిన రాజకీయాల కోసం ఏపీపై ఎందుకు విమర్శలు చేస్తారు! వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నంతమాత్రాన కొత్త పెట్టుబడులు పెట్టరా? నిజంగానే  అప్పట్లో ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోతే లోక్ సభలోనే ప్రస్తావించేవారు కదా? అసలు ప్రతిపాదనే చేయకుండా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఎవరు నమ్ముతారు!  'నన్ను కొట్టినా,తిట్టినా,జైలుకు  పంపినా ఫర్వాలేదు.. గమ్మున కూర్చోమంటే నా వల్ల కాదు"అని జయదేవ్ అన్నారు.  

అదే నిజమైతే , అంత ధైర్యవంతుడవైతే వచ్చే ఎన్నికలలో పోటీచేసి గెలిచి లోక్ సభలో ఈ అంశాలపై తన వాణి వినిపించవచ్చు కదా! అంటే ఒక పక్క పిరికితనంతో వ్యవహరిస్తూనే మరో పక్క ఇలా మేకపోతు గాంభీర్యపు ప్రకటనలు దేనికి! అంతగా తప్పులు చేయకపోతే, భయం లేని వ్యక్తి అయితే గత మూడు సంవత్సరాలుగా రాజకీయాలలో ఎందుకు క్రియాశీలకంగా లేరో కూడా చెప్పాలి కదా! మరో సందర్భంలో ప్రజల గొంతుకగా ఉండలేకపోతున్నానన్న కారణంతో రాజకీయాలకు దూరం అవుతున్నానని చెబుతారు.

మరో వైపు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలనై బురద జల్లుతున్నారు. ఇప్పుడు కూడా తెలుగుదేశంలోనే ఉంటానని అంటున్నారు కదా!అప్పుడు  ప్రభుత్వాలకు కోపం రాదా . దీనిలో డొల్లతనం కనిపించడం లేదా? తన వ్యాపార స్వార్ధం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని వెనక్కి నెట్టేశానని ఆయన ఒప్పుకుంటున్నారా? ఒకదానికి మరోదానికి పొంతన లేకుండా ఆయనమాట్లాడుతన్నారనిపిస్తుంది.

అమరరాజా బాటరీస్ టర్నోవర్ ను 58వేల కోట్లకు తీసుకు వెళ్లే లక్ష్యం పెట్టుకున్నానని చెప్పినప్పుడు మధ్యలో ఈ అనవసర రాజకీయ ప్రకటనలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది? మరో రెండునెలల్లో లోక్‌సభ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి కదా!తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమ గెలుపు ఖాయమని అంటున్నారు కదా? అది నిజమే అని జయదేవ్ నమ్మి ఉంటే ఎంపీగా పోటీచేయవచ్చు కదా! టీడీపీ ప్రభుత్వం వస్తే వేధింపులు  ఉండవని ఆయన చెప్పదలిచారనుకుందాం.

అలాంటప్పుడు రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించడం ఎందుకు? టీడీపీ కొత్త అభ్యర్ధిని వెతుక్కోవలసిన అవసరం కల్పించడం ఎందుకు?ఇవిన్ని పరిశీలిస్తే జయదేవ్ అసత్యాలు చెబుతున్నారని తేలిపోతుంది. అంతేకాక ఆయన తన మీద తనకే విశ్వాసం లేక, టీడీపీ విజయంపై నమ్మకం లేక ఈ రాజకీయ డ్రామాకు తెరదీశారా అన్న సందేహం వస్తుంది. చంద్రబాబుతో ఉన్న రహస్య  ఆర్ధిక సంబంధాల రీత్యానే టీడీపీలో కొనసాగుతున్నానని చెబుతన్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. జయదేవ్ గారూ.. మీరు వ్యాపారానికి వెళ్తే వెళ్లండి. కాని ఆ పనిమీద వెళుతూ ఎవరి మీదో రాయివేసి వెళ్లినా, బురద వేసినా అవి మీమీదే పడతాయని గమనించండి.


-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement