శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేల వీరంగం 

TDP MLAs Over Action In AP Assembly Sessions - Sakshi

సాక్షి, అమరావతి: శాసన సభ సమావేశాల్లో చివరిరోజైన బుధవారం టీడీపీ ఎమ్మెల్యేలు వీరంగం సృష్టించారు. చట్ట సభ ఖ్యాతిని దిగజార్చేలా వ్యవహరించారు. స్పీకర్‌ పట్ల అమర్యాదగా వ్యవహరించారు. మార్షల్స్‌పైనా దాడికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభమైంది. సభ ప్రారంభలోనే ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోందని, దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బిల్లు ఇంకా ప్రవేశపెట్టలేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. దానిని ప్రవేశపెట్టినప్పుడు అభిప్రాయాలు తెలిపి, చర్చించండని స్పీకర్‌ సూచించినా పట్టు వీడలేదు. ఓ వైపు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తుంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు చేరారు. పోడియం పైకి ఎక్కి స్పీకర్‌ చైర్‌ను ఆనుకుని నినాదాలు చేశారు. వారి స్థానాల్లోకి వెళ్లాలని స్పీకర్‌ సూచించినా పట్టించుకోలేదు.  

తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన స్పీకర్‌ 
టీడీపీ ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, డోలా బాలవీరాంజనేయ స్వామి, అశోక్, ఇతరులు కాగితాలు చించి స్పీకర్‌ పైకి విసిరారు. అయినా స్పీకర్‌ సంయమనం పాటించారు. స్పీకర్‌పై కాగితాలు విసరడాన్ని తప్పుబడుతూ అధికారపక్ష సభ్యులు పోడియం వద్దకు వస్తుండగా స్పీకర్‌ రావద్దని సూచించారు. దీంతో వారు ఆగిపోయారు. టీడీపీ సభ్యుల తీరు శ్రుతి మించడంతో స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని వారిపై మండిపడ్డారు.

ఈ క్రమంలో స్పీకర్‌కు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో సభను స్పీకర్‌ వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశం అయ్యాక కూడా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారలేదు. ప్లకార్డులతో నేరుగా స్పీకర్‌ పోడియం పైకి వెళ్లారు. స్పీకర్‌ చైర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాగితాలు చించి స్పీకర్‌పై వేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రతిపాదించారు.

ఈ మేరకు స్పీకర్‌ తమ్మినేని టీడీపీ సభ్యులను ఒక రోజు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకుండా స్పీకర్‌ పోడియం వద్దే నినాదాలు చేశారు. వారిని బయటకు తరలించాలని మార్షల్స్‌ను స్పీకర్‌ ఆదేశించారు. వారిని తరలించడానికి మార్షల్స్‌ ప్రయత్నించగా.. పయ్యావుల, బాలవీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు సహా పలువురు ఎమ్మెల్యేలు మార్షల్స్‌పైనే దాడికి పాల్పడ్డారు. స్పీకర్, అధికారుల టేబుళ్లపై ఉన్న బిల్లు ప్రతులను చించి గందరగోళం సృష్టించారు. చవరికి వారిని మార్షల్స్‌ ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లారు. 

హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై చర్చించని టీడీపీ 
హెల్త్‌ యూనివర్సిటీకి డాక్టర్‌ వైఎస్సార్‌ పేరు పెడుతూ ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుపై టీడీపీ సభ్యులు చర్చ కంటే రచ్చకే ప్రాధాన్యం ఇచ్చారు.  సభా సమయాన్ని వృథా చేయ డం తగదని, బిల్లుపై చర్చలో పాల్గొని అభిప్రాయం చెప్పాలని చైర్మన్‌ మోషేన్‌రాజు సూచించారు.

బిల్లును పెట్టవద్దని అడ్డు చెప్పే అధికారం లేదని చైర్మన్‌ చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ కాగితాలు చించి, వాటర్‌ బాటిల్స్‌తో బల్లలపై కొడుతూ గందరగోళం సృష్టించారు. సభను పలుమార్లు వాయిదా వేశారు. అయినా∙టీడీపీ సభ్యుల తీరు మారలేదు. దీంతో బిల్లులను ఆమోదించి సభను నిరవధిక వాయిదా వేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top