‘షాడో’పై వ్యతిరేక బాజా

TDP Leaders Conflicts in Webinar Meeting East Godavari - Sakshi

‘బాబు’ వద్ద నాయకత్వ పంచాయతీ 

మాజీ మంత్రి చినరాజప్పపై నల్లమిల్లి ఫైర్‌ 

ఎటూ తేల్చక ముగించిన వెబినార్‌

టీడీపీకి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒకరైతే పెత్తనం మరొకరిది. దీంతో ఆ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్యపోరుతో సతమతమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి వెలగబెట్టడంతో సరేలే అని సర్దుకుపోయిన వారు ఇప్పుడు తిరుగుబాటను ఎంచుకున్నారు. ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న పోరు మంగళవారం ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆధ్యక్షతన జరిగిన వెబినార్‌లోబహిరంగ ఫిర్యాదులకు దిగడం... మాటల తూటాలు పేల్చడంతో విభేదాలు బట్టబయలయ్యాయి.

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉంది జిల్లా తెలుగుదేశం పార్టీ పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన ఆ పార్టీకి జిల్లాలో దిశానిర్దేశకత్వం కొరవడింది. పార్టీ అధినేత చంద్రబాబు సైతం వయోభారంతో పార్టీపైన, నేతలపైన పట్టు కోల్పోతున్నారనే భావన పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇది వరకు ఆయన సమక్షంలో జరిగే పార్టీ సమావేశాల్లో పెదవి విప్పని నేతలు కూడా ఇప్పుడు తరచు జిల్లా నాయకత్వ తీరును దుయ్యబడుతున్నారు. మాజీ సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో జూమ్‌లో వెబినార్‌ మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు చంద్రబాబు సాక్షిగా బట్టబయలవడంతో పార్టీ వర్గాలకు మింగుడుపటం లేదు. ప్రధానంగా పార్టీ జిల్లా నాయకత్వంపై దాదాపు నేతలంతా గుర్రుగా ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడుగా జెడ్పీ మాజీ చైర్మన్‌ (పదవీ కాలం పూర్తికాకుండానే అర్ధాంతరంగా మధ్యలోనే దింపేసిన)నామన రాంబాబును అధ్యక్ష స్థానానికే పరిమితం చేసేశారని పలువురు నేతలు చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు. నామనను నామ్‌కేవాస్తే అధ్యక్షుడిగా చేసి సర్వం తానే అన్నట్టు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వ్యవహరిస్తున్నారని కొందరు నేతలు తీవ్రంగా తప్పుపట్టారని తెలియవచ్చింది. చినరాజప్ప పార్టీకి షాడో అధ్యక్షుడిగా తయారవడంతో తమ బోటి నాయకులకు విలువ లేకుండా పోయిందని సీనియర్లు బాబు దృష్టికి తీసుకువెళ్లారని తెలియవచ్చింది. ఆ పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి  చినరాజప్పపై చంద్రబాబుకు నేరుగా పలు ఫిర్యాదులు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆధిపత్యపోరుతో విసుగు 
కోవిడ్‌–19తో జిల్లా ప్రజలు అతలాకుతలమవుతుంటే తెలుగు తమ్ముళ్లు ఆధిపత్య పోరు కోసం వెంపర్లాడటం విస్మయాన్ని కలిగిస్తోంది. కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలవాల్సిన పార్టీ నాయకత్వం నుంచి కనీసం స్పందన లేకపోగా జిల్లా నాయకత్వం కోసం ఆధిపత్య పోరుకు తెరతీయడాన్ని విజ్ఞులు తప్పుపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్ట బోయిన చందాన కేవలం నాలుగు సీట్లకే పరిమితమైనా ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలనే ధ్యాస ఆ పార్టీ నాయకులకు లేకుండా పోవడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని పలువురు సీనియర్లు చంద్రబాబు ముఖంమీదనే కుండబద్దలు కొట్టారని తెలిసింది. ఫిరాయింపు నేత జ్యోతులకు ఇచ్చిన మాటకోసం చంద్రబాబు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న నామనను తప్పించి ఆ పదవిని జ్యోతుల నవీన్‌కుమార్‌కు కట్టబెట్టిన విషయం తెలిసిందే.

రాంబాబును బుజ్జగించేందుకు అన్నట్టుగా జిల్లా అధ్యక్ష పదవిని వద్దన్నా అంటగట్టారు. ఆయన మెతక వైఖరి కారణంగా పార్టీ పగ్గాలను అనుభవమనే ఆయుధాన్ని వాడుకుంటూ రాజప్ప నేటీకీ చక్కబెడుతున్నారు. చినరాజప్ప ఇటీవల పెదపూడి మండలానికి చెందిన సంపర మాజీ ఎమ్మెల్యే మట్ట వెంకటరమణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చారు. అక్కడ కొంతమంది తనకు పూర్వాశ్రమం నుంచి తెలిసిన వైఎస్సార్‌సీపీ నాయకులను పలకరించడం రామకృష్ణారెడ్డికి రుచించ లేదు. ఆ రోజే రాజప్పను రామకృష్ణారెడ్డి అడిగినా సరైన సమాధానం లేకపోవడంతో యనమల దృష్టికి వెళ్లింది. దీనిని సర్థుబాటు చేయాల్సిందిగా చినరాజప్పకే తిరిగి యనమల అప్పగించినా ఫలితం లేకపోవడంతో ఆ పంచాయతీ వెబినార్‌లో చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయినా చినరాజప్ప పెద్దగా పట్టించుకోకపోవడంతో రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారంటున్నారు.

అదే సమయంలో పార్టీ జిల్లా నాయకత్వాన్ని, షాడో రాజకీయాన్ని మార్చాలని డిమాండ్‌ వచ్చింది. అలా మార్చుకోకుంటే తామే పార్టీ మారిపోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు సమాచారం. జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టీడీపీ నేతలు ‘నిమ్మ’కు నీరెత్తినట్లు వ్యవరిస్తున్న తీరుపై పార్టీ సీనియర్లు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. నమోదవుతున్న కేసులపై అధినాయకత్వం ట్విటర్‌లోను, ప్రసార మాధ్యమాల్లో స్పందించడమే గాని క్షేత్ర స్థాయిలో పట్టించుకోవడాన్ని పలువురు తప్పుపట్టారు. ఈ విషయాలపై కొందరు నేతలు నేరుగా చంద్రబాబుపైనే ప్రశ్నల వర్షం కురిపింకచారని చెబుతున్నారు. చివరకు లోపం మీ వద్ద ఉందా, జిల్లా నేతల వద్ద ఉందా అని బాబును ప్రశ్నించారని తెలిసింది. అన్నీ ఆలకించిన బాబు జిల్లా నాయకత్వంపై త్వరలో నిర్ణయం తీసుకుందాం, రెండు పార్లమెంటు స్థానాలు కలిపి ఒక జిల్లాగా పరిగణించి పార్టీ పగ్గాలు అప్పగిద్దామని నచ్చజెప్పి వెబినార్‌ను ముగించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top