దుర్మార్గం.. దిగజారుడుతనం

TDP leaders attacks On YSRCP activists - Sakshi

టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన

వైఎస్సార్‌సీపీ అభిమానులు, యువకులు, మహిళల ధర్నాలు, ర్యాలీలు

హిందూపురంలో బాలకృష్ణ ఇల్లు ముట్టడి

గుంటూరులో పట్టాభి, చంద్రబాబు దిష్టి బొమ్మల దహనం

విశాఖలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై టీడీపీ నేతల దాడి

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సర్వత్రా నిరసన వ్యక్తమైంది. అన్ని వర్గాల ప్రజలు ఆ వ్యాఖ్యలను తప్పు పట్టారు. సభ్య సమాజం తలదించుకునేలా, విచక్షణ మరచి అలా మాట్లాడటం దారుణం అని, ఇదంతా పక్కా స్కెచ్‌ అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ఇలా మాట్లాడించారని అన్నారు. నెల్లూరు నగరంలో యువజన, విద్యార్థి సంఘాల నాయకులు హరనాథపురం సెంటరు నుంచి మినీబైపాస్‌ రోడ్డులోని తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయం సమీపం వరకు ర్యాలీ నిర్వహించారు.

టీడీపీ కార్యాలయానికి సమీపంలో పోలీసులు ర్యాలీ చేస్తున్న వారిని అడ్డగించారు. దీంతో రోడ్డుపై బైఠాయించి శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్లు మాట్లాడే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో కొత్త సంప్రదాయానికి తెరదీస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న చోటా టీడీపీ నేతలు.. ధర్నా చేస్తున్న వారిని, ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని పోలీసులు వారిస్తున్నా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు వైఎస్సార్‌సీపీ అభిమానులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 
గుంటూరులో చంద్రబాబు చిత్రపటాలను చెప్పులతో కొడుతున్న మహిళలు 

పట్టాభీ.. నోరు అదుపులో పెట్టుకో 
టీడీపీ నేత పట్టాభిరాం నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎంపై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని అనంతపురం జిల్లా హిందూపురంలో అభిమానులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని వారు ఈ సందర్భంగా ముట్టడించారు. అంతకు ముందు ప్రెస్‌క్లబ్‌ నుంచి ర్యాలీగా బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకుని బైఠాయించారు.

టీడీపీ నాయకులది నీచ సంస్కృతి అని దుయ్యబట్టారు. సీఎం జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు తన పార్టీ నాయకులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కడప, ప్రొద్దుటూరులో టీడీపీ నేతల ఇంటి ముందు వైఎస్సార్‌సీపీ అభిమానులు ధర్నా నిర్వహించారు. గుంటూరులోని హిందూ కాలేజీ కూడలి వద్ద పలువురు మహిళలు, యువకులు టీడీపీ వైఖరిపై నిరసన తెలిపారు. టీడీపీ జెండాలను తగలబెట్టారు. టీడీపీ నాయకులే గంజాయి సాగు చేస్తూ, అధికార పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని యువకులు మండిపడ్డారు. 

విశాఖలో టీడీపీ నేతల దాడి
విశాఖలో పలువురు యువకులు, మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టాభి.. చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో టీడీపీ కార్యాలయంలో ఉన్న కొంత మంది కార్యకర్తలు మహిళలపై దాడికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించేశారు. అంతలోనే టీడీపీ విశాఖ పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మహిళలను దుర్భాషలాడారు. దీంతో ఆయన్ను అరెస్టు చేయాలని మహిళలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు వారిని దుర్భాషలాడుతూ దాడికి దిగారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top