పథకమా.. పన్నాగమా.. అచ్చెన్నాయుడు మాస్టర్‌ ప్లాన్‌? | Sakshi
Sakshi News home page

పథకమా.. పన్నాగమా.. అచ్చెన్నాయుడు మాస్టర్‌ ప్లాన్‌?

Published Sun, Jan 2 2022 1:39 PM

TDP Leader Atchannaidu Master Plan For Supremacy - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. చాలా కాలంగా చెలామణీలో ఉన్న నాయకులు కాకుండా అవే స్థానాల్లో వేరే వాళ్ల ముఖాలు ఫ్లెక్సీ లు, సోషల్‌ మీడియా వేదికల్లో కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఓ ప్లాన్‌ ప్రకారమే జరుగుతున్నట్లు భోగట్టా. తన ఆధిపత్యం నిలుపుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లాలోని సీనియర్‌ నాయకులకు చెక్‌ పెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చాప కింద నీరులా పావులు కదుపుతున్న అచ్చెన్న జిల్లాపై పట్టు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే సీనియర్లు ఆ ఎత్తుగడలను పసిగట్టేసి తమ ఉనికి నిలుపుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 చదవండి: ఛీ ఛీ పార్టీ ఆఫీస్‌లో ఇదేం పని.. బీజేపీ నేతల వీడియో వైరల్‌

కొత్త నాయకులు..
ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుకు చెక్‌ పెట్టేందుకు ఆ పార్టీకి చెందిన మరో నేత కలిశెట్టి అప్పలనాయుడును అచ్చెన్న ప్రోత్సహిస్తున్నారు. కళా వెంకటరావు కూడా నియంతృత్వ పోకడతో ముందుకెళ్తుండటం వల్ల అప్పలనాయుడుకు కలిసి వస్తోంది. ‘స్థానిక’ నినాదంతో అప్పలనాయుడును తెరపైకి తెచ్చి, అధిష్టానం నోట్లో ఆయన పేరు నానేలా అచ్చెన్న అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కళా వెంకటరావు కూడా వ్యూహాత్మకంగానే అప్పలనాయుడును టార్గెట్‌ చేసి, పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు రెండు పర్యాయాలు ప్రకటించారు. అయినా అప్పలనాయుడు వెనక్కి తగ్గలేదు. నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లి తన ఉనికిని చాటుకుంటున్నారు. అధినేత వరకు ఆయన వెళ్లగలిగింది అచ్చెన్నాయుడు వల్లనేనని కార్యకర్తలందరికీ తెలుసు.

తాజాగా పాతపట్నం నియోజకవర్గంలో కూడా అక్కడ సీనియర్‌ నేత కలమట వెంకటరమణకు బ్రేక్‌ వేసేందుకు పావులు కదుపుతున్నట్టుగా స్పష్టమవుతోంది. అక్కడొక ద్వితీయ శ్రేణి నాయకుడు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మామిడి గోవిందరావును అచ్చెన్నాయుడు తెరపైకి తీసుకొచ్చినట్టుగా ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో కోట్లు గడించిన మామిడి గోవిందరావైతే తనకు అన్ని విధాలుగా బాగుంటుందని ప్రోత్సహిస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగానే చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి, లక్ష రూపాయల విరాళం ఇప్పించి, ఒక ఫొటో తీయించి బయటకు వదిలా రు. ఆ ఫొటో పట్టుకుని, ప్లెక్సీల్లో పెట్టుకుని మామిడి గోవిందరావు రాజకీయం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్‌ ఇస్తారని సంకేతాలు ఇస్తున్నారు. దీని వెనుక అచ్చెన్న ఉన్నాడని గ్రహించిన కలమట వెంకటరమణ గత నెల 30న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరయ్యారు. మామిడి గోవిందరావును ప్రోత్సహిస్తున్నందుకు ఇలా నిరసన తెలిపారు. 

పలాస నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. గౌతు ఫ్యామిలీకి అడ్డుకట్ట వేసేందుకు అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. భవిష్యత్‌లో తనకు పోటీగా తయారవుతారన్న అభద్రతా భావమో, మరే లోపాయికారీ ఒప్పందమో గానీ గౌతు శిరీష ను పక్కన పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టుగా తెలిసింది. అక్కడామెకు బలం లేదని, అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే కారణాలను చూపిస్తూ గౌతు శిరీషను కాకుండా జుత్తు తాతారావు అనే నాయకుడిని తెరపైకి తీసుకువస్తున్నారు.

ఇప్పటికే జుత్తు తాతారావు నియోజకవర్గంలో తనకే టిక్కెట్‌ అని ప్రచారం చేసుకుంటున్నారు. దీనివెనక అచ్చెన్న హస్తం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలో గౌతు శిరీష నిలదీశారు. తనకు జరుగుతున్న అవమానకర పరిస్థితులు, ఎదురవుతున్న పరిణామాలను సభలోనే ప్రస్తావించి, నిరసన గళం వినిపించారు.  మరికొన్ని నియోజకవర్గాల్లోనూ అచ్చెన్నాయు డు తన వర్గాన్ని తయారు చేసుకోవాలని చూస్తున్న ట్టుగా స్పష్టమవుతోంది. గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం నాయకత్వం కూడా చేజారిపోయేలా ఉందని అచ్చెన్న ఎత్తుగడలకు బలి కాబోతున్న నా యకులు ఆందోళన చెందుతున్నారు. కొందరు బ హిరంగంగా నిరసన తెలియజేస్తుండగా, మరికొందరు లోపాయికారీగా పనులు చేసుకుంటున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement