
గుడివాడ: కృష్ణా జిల్లాలోని గుడివాడలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

మహిళ అని చూడకుండా దాడికి పాల్పడ్డాయి పచ్చమూకలు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. వాళ్లు దాడి చేసుకుంటారు.. మనకెందుకులె అన్న చందంగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళుతున్న దారిలోనే ప్రభుత్వ సమావేశం జరుగుతుంది. దాంతో ఆమెను వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్లకుండా చేసేందుకు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు.
గంటకు పైగా కదలకుండా చుట్టుముట్టి..
గుడివాడలో టీడీపీ, జనసేన గూండాల ఉన్మాద చర్యలకు పోలీసులు సహకరించారు. జడ్పీ చైర్ పర్సన్ హారిక కారును గంటకు పైగా కదలకుండా చేసినా పోలీసులు నామమాత్రంగానే వ్యవహరించారు. తన కారును చుట్టుముట్టినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడంపై హారిక అసహనం వ్యక్తం చేశారు. .జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం పై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
