లెక్క తేల్చిన డీఎంకే; అన్నాడీఎంకేకు తప్పని తలనొప్పి!

Tamil Nadu Assembly Polls DMK To Contest 174 Seats Congress 25 - Sakshi

డీఎంకే 174 స్థానాల్లో పోటీ

కసరత్తుల్లోనే అన్నాడీఎంకే కూటమి

ఎదురుచూపుల్లో మూడో కూటమి

సాక్షి, చెన్నై: సీట్ల సర్దుబాట ప్రక్రియను డీఎంకే ముగించింది. 174 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయనుంది. అన్నాడీఎంకేలో సీట్ల సర్దుబాటు కసరత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. లెక్కతేలినా, ఎవరైనా వస్తారన్న ఎదురుచూపుల్లో మూడో కూటమి ఉంది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు మరో రోజు మాత్రమే సమయం ఉంది. ఈనెల 12 నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో రాజకీయపక్షాలు పొత్తులు, సీట్ల సర్దుబాటు కసరత్తులు వేగవంతం చేశాయి. ఇందులో డీఎంకే ముందడుగు వేసింది. సీట్ల సర్దుబాటు ప్రక్రియను మంగళవారంతో ముగించింది.

ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలోని 234 స్థానాల్లో డీఎంకే –174, కాంగ్రెస్‌–25, సీపీఎం –6, సీపీఐ–6, వీసీకే –6, ఎండీఎంకే –6, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌కు –3,  మనిదనేయ మక్క ల్‌ కట్చికి –2, కొంగు మక్కల్‌ దేశీయ కట్చికి –3 తమిళర్‌ వాల్వురిమై కట్చికి ఒకటి చొప్పున సీట్లు కేటాయించారు. మరో రెండు చిన్న పార్టీలకు తలా ఓ సీటు ఇచ్చారు. దీంతో కూటమిలోని ఆయా పార్టీ లు తమకు కావాల్సిన నియోజకవర్గాలు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఇక చెన్నైలో డీఎంకే 14 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం వెలువడింది. ఎండీఎంకేతో పాటు చిన్న పార్టీల అభ్యర్థులు డీఎంకే చిహ్నంతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇక ఎవరైనా కలిసి వ చ్చినా వారు డీఎంకే చిహ్నంపై పోటీ చేయాల్సిందే. 

అన్నాడీఎంకేలో తేలని లెక్క.. 
అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంచాయితీ లెక్క తేలడం లేదు. పీఎంకేకు మాత్రం 23 సీట్లు కేటాయించారు. బీజేపీకి 20 ఇచ్చినా, అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ కూటమిలోని డీఎండీకే,  తమిళ మానిల కాంగ్రెస్‌తో సీట్ల పందేరం కొలిక్కి రాలేదు. తమతో అన్నాడీఎంకే వ్యవహరిస్తున్న తీరుతో విసిగి వేసారిన విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే కూటమి నుంచి వైదొలగుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. అయితే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని విజయకాంత్‌కు అన్నాడీఎంకే, బీజేపీలు సూచించే పనిలోపడ్డాయి. అన్నాడీఎంకే కూటమికి మరికొన్ని చిన్న పార్టీలు మద్దతు ఇచ్చినా లెక్క తేలడానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. విజయకాంత్‌ తరహాలో తమిళ మానిల కాంగ్రెస్‌ కూడా నిర్ణయం తీసుకోవచ్చన్న ప్రచారం నేపథ్యంలో ఈ కూటమి నామినేషన్లకు ముందే చెల్లా చెదురయ్యేనా అన్న చర్చ జోరందుకుంది.  

ఎదురుచూపుల్లో మూడో ఫ్రంట్‌.. 
నటుడు, మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కూటమిలో ఐజేకే, ఎస్‌ఎంకేలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలు సీట్ల పంపకాల్ని ముగించాయి. మక్కల్‌ నీది మయ్యం–154, ఐజేకే, ఎస్‌ఎంకేలు తలా 40 స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించాయి. ఈ సమయంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన డీఎండీకేకు మూడో కూటమి ఆహ్వానం పలికే పనిలో పడింది. అలాగే, తమతో మరెవరైనా కలిసి అడుగులు వేయవచ్చన్న ఎదురుచూపుల్లో మూడో ఫ్రంట్‌ వర్గాలు ఉన్నాయి. ఆ మేరకు కూటమికి ఓ మంచి పేరు పెట్టడమే కాకుండా, సీట్ల లెక్కల వివరాల్ని అధికారికంగా ప్రకటించేందుకు కమల్‌ నిర్ణయించారు. 
చదవండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో అర్జున్‌ భేటీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top