ఎన్నికల చిహ్నంపై స్టే కుదరదు: హైకోర్టు

Tamil Nadu Assembly Polls 2021 Madras High Court Says No Stay On Election Symbols - Sakshi

ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు 

పక్షపాత కలెక్టర్, ఎస్పీలపై వేటు

సాక్షి ప్రతినిధి, చెన్నై: గుర్తింపు పొందిన పార్టీల చిహ్నాలను కూటమి పార్టీల అభ్యర్థులకు కేటాయింపుపై నిషేధం విధించేందుకు వీలులేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎన్నికలు ముగిసిన తరువాత ఈసీ బదులివ్వాలని బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి 14 మంది మిత్రపక్ష పార్టీల అభ్యర్థులు ఉదయసూర్యుని గుర్తుపై పోటీచేస్తున్నారు. అలాగే అన్నాడీఎంకే కూటమిలోని 12 మంది మిత్రపక్ష అభ్యర్థులు రెండాకుల చిహ్నంపై బరిలోకి దిగుతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఆయా పార్టీల సభ్యులు మాత్రమే ఆ చిహ్నంపై పోటీచేయాలని, ఇతరులు పోటీ చేసేందుకు వీలులేకున్నా ఎన్నికల అధికారులు వారి నామినేషన్లను అంగీకరించారని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజనవాజ్యం దాఖలైంది. గుర్తింపు పొందిన పార్టీలు మిత్రపక్షపార్టీలకు తమ పార్టీ చిహ్నం కేటాయించకుండా ఎన్నికల కమిషన్‌కు నిషేధ ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్‌ కోరారు.

ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్‌కుమార్‌ రామమూర్తిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌కు బుధవారం విచారణకు వచ్చింది. ఎన్నికల చిహ్నం కేటాయింపులు పూర్తయినందున పిటిషనర్‌ వాదనపై ప్రస్తుత ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని న్యాయమూర్తులు అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పిటిషన్‌పై బదులి పిటిషన్‌ దాఖలు చేయాల్సిందిగా ఈసీని కోర్టు ఆదేశిస్తూ విచారణను జూన్‌ 3వ వారానికి వాయిదావేసింది. 

జిల్లా కలెక్టర్, ఎస్పీలపై వేటు 
అధికార అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌ రాజామణి, పోలీస్‌ కమిషనర్‌ సుమిత్‌ శరణ్‌లను ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది. చెన్నై వేలాచ్చేరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఘర్షణకు దిగిన అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ అభ్యర్థులపై తిరువాన్మియూరు పోలీసులు మూడు సెక్షన్లపై కేసులు పెట్టారు. ఐజేకే కూటమి సారధి, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణంలో మిత్రపక్ష సమక అధ్యక్షులు శరత్‌కుమార్‌ గురువారం ప్రచారం చేయనున్నారు.

చెన్నైలో 7,300 మంది వృద్ధుల నుంచి పోస్టల్‌ ఓట్ల కోసం ఈసీ 70 బృందాలను నియమించింది. ఇంటింటికీ వెళ్లి పోస్టల్‌ ఓట్ల సేకరణకు శిక్షణ బుధవారం ప్రారంభమైంది. సొంతూళ్లకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా 14,215 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి 5వ తేదీ వరకు నడిపే ఈ ప్రత్యేక బస్సుల కోసం బుధవారం రిజర్వేషన్‌ ప్రారంభమైంది. పోలింగ్‌  నేపథ్యంలో ఈనెల 4,5,6 తేదీల్లో టాస్మాక్‌ దుకాణాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top