షాకింగ్‌: కాంగ్రెస్‌ మహిళా నేతపై కార్యకర్తల దాడి

Shocking Incident: UP Congress Woman Leader Beaten By Activists - Sakshi

లక్నో: హాథ్రస్‌‌ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో కాంగ్రెస్‌కు కొత్త జోష్‌ వచ్చిందని రాజకీయ విశ్లేకులు చెప్తున్నారు. ముఖ్యంగా నాయకత్వ లేమితో ఇబ్బందులు పడుతున్న పార్టీని ప్రియాంక ముందుండి నడిపించగలదని అంటున్నారు. కానీ, అదే ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన కాంగ్రెస్‌ పార్టీలో మహిళలపట్ల వివక్ష ఏమేరకు ఉందో కళ్లకు కడుతోంది. కాంగ్రెస్‌ మహిళా నేత తారా యాదవ్‌పై పార్టీ కార్యకర్తలు దాడికి దిగిన షాకింగ్‌ ఉదంతం డియోరియా ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నాయకుడికి టికెట్‌ ఇవ్వడంపై ఆమె గళమెత్తడంతో.. మరో వర్గం కార్యకర్తలు ఆమెపై చేయి చేసుకున్నారు.
(చదవండి: కొత్తగాలి.. ఆశ – పాత ‘స్వరం’.. ఘోష)

‘లైంగికదాడి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ముకుంద్‌ భాస్కర్‌కు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం సరైనది కాదని అభిప్రాయం చెప్పాను. అంతమాత్రానికే అతని అనుచరులు కొందరు నాపై దాడి చేశారు. రౌడీల్లాగా ప్రవర్తించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఆమె నాకు న్యాయం చేస్తుందని భావిస్తున్నా’అని తారా యాదవ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, తారా యాదవ్‌పై దాడి ఘటనను బీజేపీ నేతలు ఖండించారు. కాంగ్రెస్‌లో మహిళలకు గౌరవం లేదని మరోసారి వెల్లడైందని విమర్శించారు. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి విజ్ఞప్తి చేశారు. విచారణ చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌ పర్సన్‌ రేఖా శర్మ ట్విటర్‌లో తెలిపారు.
(చదవండి: యోగీ కాచుకో.. ఇదే నా చాలెంజ్‌!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top