శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు?

Sharad Pawar: Shinde Govt May Fall In 6 Months Be Ready For Mid Term Polls - Sakshi

ముంబై: ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన ఏక్‍నాథ్ షిండే సర్కార్ ఆరు నెలల్లో కూలిపోతుందని చెప్పారు. షిండే వర్గంలోని కొందరు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మంత్రిత్వ శాఖల కేటాయింపుల తర్వాత ఈ లుకలుకలు బయటపడతాయని ఆయన పేర్కొన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో జరిగిన సమావేశంలో పవార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు పవార్‌ సూచించినట్లు వెల్లడించారు.

‘ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలోని కొందరు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. మంత్రివర్గంలో శాఖల కేటాయింపు తర్వాత ఈ అనిశ్చితి బయటపడుతుంది. అప్పుడు రెబల్‌ ఎమ్మెల్యేలంతా మళ్లీ ఠాక్రే నేతృ‍త్వంలోని శివసేనలోకి తిరిగివస్తారు. దీంతో షిండే ప్రభుత్వం కూలిపోతుంది. రానున్న ఆరు నెలల్లో మధ్యంతర ఎన్నికలు జరగొచ్చు. అందుకు ఎన్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి.' అని పవార్ చెప్పారని సమావేశానికి హాజరైన ఎన్సీపీ నాయకుడు ఒకరు వెల్లడించారు.

ఉద్ధవ్ ఠాక్రేపై తిరగుబావుటా ఎగురవేసి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చారు ఎక్‌నాథ్ షిండే. బీజేపీ మద్దతుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. శివసేన షిండే వర్గం మద్దతు తెలిపిన బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్‌  నూతన స్పీకర్‍గా ఎన్నికయ్యారు.
చదవండి: హోం, ఆర్థిక శాఖ మాకే కావాలి.. పట్టుబడుతున్న షిండే వర్గం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top