జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

SEC Released GHMC Elections Schedule And Notification - Sakshi

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను దాంతోపాటు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డిసెంబర్‌ 1న ఓటింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌ చేపడుతామని తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్‌ 3న రీ పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. రేపటి నుంచి డివిజన్ల వారీగా నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నవంబర్‌ 20 నామినేష్ల దాఖలుకు చివరి తేదీ అని, నవంబర్‌ 21 న నామినేషన్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. నవంబర్‌ 22న నామినేష్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ఎస్‌ఈసీ తెలిపారు. డిసెంబర్‌ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయని పార్థసారథి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.

ఎస్‌ఈసీ పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. 2016లో ఏ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయో.. అవే రిజర్వేషన్లు ఉంటాయి. ఈనెల 13న ఓటర్ల తుది జాబితా పూర్తైంది. ఫిబ్రవరి 10తో జీహెచ్‌ఎంసీ పదవీకాలం ముగియనుంది. ప్రతి డివిజన్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారి ఉంటారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తాం. గతంలో ఏపీ ఈసీకి బ్యాలెట్‌ బాక్సులు ఇచ్చాం.. ఇప్పుడు అవి తెచ్చుకుంటాం. ఈనెల 20న పోలింగ్‌ బూత్‌ల తుది వివరాలు వెల్లడిస్తాం’అని పేర్కొన్నారు.
(చదవండి: సర్వశక్తులూ ఒడ్డాల్సిందే!)

పాత రిజర్వేషన్లే ఇప్పుడూ..
2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని ఎస్‌ఈసీ పార్థసారథి అన్నారు. జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్ల కేటాయింపులు అనేది ప్రభుత్వ వ్యవహారమని చెప్పారు. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే గ్రేటర్‌ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వయోజనులు ఓటు వేసేందుకు అర్హులని తెలిపారు. బల్దియా పరిధిలో 52.09 శాతం పురుష, 47.90 శాతం మహిళా ఓటర్లున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 74 లక్షల 4 వేల మందికి పైగా ఓటర్లున్నారని వెల్లడించారు. అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లిలో 79,290 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా రామచంద్రాపురంలో 27,997 మంది ఓటర్లున్నారని ఎస్‌ఈసీ వివరించారు. బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
(చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో భేటీ)

గ్రేటర్‌ ఎన్నికలు-మరిన్ని వివరాలు
జీహెచ్‌ఎంసీ పరిధిలో తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌
డిసెంబర్‌ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌
మధ్యాహ్నం 12 గంటలకల్లా బ్యాలెట్‌ పేపర్లు సెపరేటు
మధ్యాహ్నం 3 గంటలకల్లా ఫలితాలు
ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 నామినేషన్‌ డిపాజిట్‌
ఇతర అభ్యర్థులకు రూ.5000 నామినేషన్‌ డిపాజిట్‌
రిటర్నింగ్‌ అధికారి దగ్గరకు వచ్చే నామినేషన్లు దాఖలు చేయాలి
48 వేల మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ
తెలుగు రంగు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగం
మొత్తం 2,700 పోలింగ్‌ కేంద్రాలు
1439 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,004
అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 257

జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు
► గ్రేటర్‌ మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌
► బీసీ -50: (జనరల్‌ 25, మహిళలు 25)
► ఎస్సీ -10: (జనరల్‌ 5, మహిళలు 5)
► ఎస్టీ-2: (జనరల్‌ 1, మహిళ 1)
► జనరల్‌ -44
► జనరల్‌ మహిళ -44

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top