శశికళ వెన్నుపోటు.. ‘నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్’! | Sasikala aim to contest tamil nadu assembly polls | Sakshi
Sakshi News home page

శశికళ వెన్నుపోటు.. ‘నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్’!

Mar 20 2026 1:53 PM | Updated on Mar 20 2026 1:59 PM

Sasikala aim to contest tamil nadu assembly polls

తెలుగు రాష్ట్రాల్లో తరచూ వినిపించే వెన్నుపోటు రాజకీయాలు ఇప్పుడు తమిళనాట ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళ రాజకీయంగా ఒంటరయ్యారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా నిలిచిన ఆర్‌బీ ఉదయ్‌కుమార్‌ ఇప్పుడు అదే శశికళ వ్యూహాలకు బలవుతున్నారా? ఆనాడు అండగా నిలిచిన ఉదయ్ ఓటమికి శశికళ పావులు కదుపుతున్నారా? అందుకే ఆమె తిరుమంగళం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారా? ఇప్పుడు దక్షిణ తమిళనాడులో.. ఇంకా చెప్పాలంటే మదురైలో ఇదే చర్చ జరుగుతోంది.

మదురై జిల్లాలోని తిరుమంగళం నియోజకవర్గానికి వీఐపీ అసెంబ్లీ సెగ్మెంట్‌గా పేరుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. శశికళ ఇప్పుడు ఈ నియోజకవర్గంపై దృష్టిసారించడం ఇందుకు ప్రధాన కారణం. శశికళ శిష్యుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష ఉపనేత అయిన ఆర్‌బీ ఉదయ్‌కుమార్‌ని ఓడించేందుకు శశికళ వ్యూహాలకు పదునుపెడుతున్నారనే చర్చ తిరుమంగళంలో జరుగుతోంది. నిజానికి ఉదయ్‌కి ఈ నియోజకవర్గం కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు రెండుసార్లు అప్రతిహతంగా విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు.

జయలలిత మరణం తర్వాత.. శశికళకు మద్దతుగా నిలిచిన వారిలో ఉదయ్ ముందంజలో ఉంటాడు. అయితే.. ఆ తర్వాత వీరి మధ్య దూరం ఎందుకు పెరిగింది?? ఈ ప్రశ్నకు తదనంతర పరిణామాలే ప్రధాన కారణమనే సమాధానం వస్తోంది. జయ మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి సీఎం అయ్యారు. దాంతో.. ఉదయ్ ఆయన వర్గానికి దగ్గరయ్యారు. అయితే.. ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. సొంతపార్టీలోనే వ్యతిరేకులు ఉన్నారు. అంతేకాదు.. పొత్తుధర్మంలో భాగంగా ఈ సీటును ఎన్డీయేకు ఇవ్వడానికి కూడా పళనిస్వామి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ తనకే టికెట్ దక్కినా.. ఉదయ్‌ని ఓడించడమే లక్ష్యంగా శశికళ పావులు కదుపుతున్నారు. దీంతో.. ఉదయ్ విజయం అంత సులభమేమీకాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా.. ఇక్కడ దళపతి విజయ్ పార్టీ టీవీకే చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటు పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరాక.. తిరుమంగళంలో కూడా పరిణామాలను అంచనావేసే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

జయలలితకు నెచ్చెలిగా ఉంటూ.. రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న శశికళ.. ఇప్పుడు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకు వస్తున్నారు. టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకే నుంచి బహిష్కరణకు గురైన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్ జీవా నాచియార్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న జీవా నాచియార్‌ ముక్కులత్తోర్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే వర్గానికి చెందిన ఉదయ్‌కుమార్‌కు ఇది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో పన్నీర్ సెల్వం కూడా ఉదయ్ వర్గీయులపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. ఉదయ్ మద్దతుదారులను డీఎంకేలో చేర్చుకున్నారు. ఈ పరిణామాలు పళనిస్వామి వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది.

ఒకప్పుడు ఉదయ్ మద్దతుదారులుగా ఉన్నవారు ఇప్పుడు పళనిస్వామికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ పరిణామాలను తట్టుకుని ఉదయ్ విజయం సాధించి, హ్యాట్రిక్‌ను నమోదు చేసుకుంటారా? శశికళ తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి, విజయం సాధిస్తుందా? పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా.. వీరి వివాదం మూడో వ్యక్తి విజయానికి బాటలు వేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement