అస్సాంలో కమలదళానికి కఠిన పరీక్ష

Sarbananda Sonawal or Himanta Biswa Sarma In Next Chief Minister - Sakshi

అస్సాం సీఎం రేసులో సోనోవాల్, హిమంతా శర్మ

అస్సాంలో కమలదళానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. క్లీన్‌ఇమేజ్‌తో బీజేపీ విజయానికి తోడ్పడిన ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ను మళ్లీ సీఎంగా ఎంపిక చేయాలా లేక అస్సాంలో అత్యంత ప్రజాదరణగల నేతల్లో ఒకరైన ఆర్థిక మంత్రి హిమంతా బిశ్వ శర్మను సీఎం చేయాలా అనే దానిపై బీజేపీ అధినాయకత్వం తేల్చుకోవాల్సి ఉంది. బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం ద్వారా సీఎం మార్పుపై ముందుగా సంకేతాలు ఇచ్చిందన్న అభిప్రాయం ఓవైపు వ్యక్తమవుతుండగా... మరోవైపు అధికారంలో ఉన్న రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి బీజేపీ చర్చించిన సంప్రదాయమేదీ గత 40 ఏళ్లలో లేదనే అంశమూ తెరపైకి వస్తోంది. ఏది ఏమైనా వారిద్దరి రాజకీయ భవిష్యత్తును ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్ణయిస్తారని, మోదీ ఎంపిక మేరకు సీఎం అభ్యర్థి ఎవరో ఖరారవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సర్బానంద... విద్యార్థి నేతగా మొదలై...
దిబ్రూగఢ్‌కు చెందిన సర్బానంద సోనోవాల్‌ ఆ రాష్ట్ర కీలక రాజకీయ నేతల్లో ఒకరిగా ఎదిగారు. బంగ్లాదేశ్‌ నుంచి అస్సాంలోకి చొరబడే అక్రమ వలసదారులను వెనక్కి పంపాలంటూ 1970లలో భారీ ఉద్యమం సాగించిన ఆల్‌అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌లో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. 1992 నుంచి 1999 వరకు ఆ యూనియన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సంస్థ రాజకీయ అవతారమైన అసోం గణ పరిషత్‌ (ఏజీపీ)లో 2001లో చేరారు. తదనంతర పరిణామాల్లో  2011లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2014లో లఖీంపూర్‌ ఎంపీగా గెలిచి మోదీ మంత్రివర్గంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అయ్యారు. 2016లో అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ఆయనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిని గెలిపించి సీఎం పగ్గాలు చేపట్టారు.

హిమంతా... విలక్షణ నేత
అస్సాంలోని గువాహటికి చెందిన  డాక్టర్‌హిమంతా బిశ్వ శర్మ విలక్షణ రాజకీయ నేతగా అంచెలంచెలుగా ఎదిగారు.  కాలేజీ రోజుల్లో విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేసిన అనుభవమున్న శర్మ 2001లో కాంగ్రెస్‌లో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో తొలిసారి ఏజీపీ నేత బీర్గు కుమారు ఫుకన్‌ను ఓడించి జాలుక్‌బరి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2006, 2011లో అదే నియోజకవర్గం నుంచి గెలిచి హ్యాట్రిక్‌కొట్టారు.  2006లో వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శర్మ 2011లో విద్యాశాఖ పగ్గాలు అందుకున్నారు. ఆ శాఖలో మంచి పనితీరు కనబరిచారు. 2014లో నాటి కాంగ్రెస్‌ సీఎం తరుణ్‌గొగోయ్‌పై తిరుగుబాటు చేసి 2015లో బీజేపీలో చేరారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో జాలుక్‌బరి స్థానం నుంచి తిరిగి గెలవడం ద్వారా ప్రభుత్వంలో కేబినెట్‌మంత్రిగా చేరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top