ఎయిడెడ్‌పై చంద్రబాబు ఆందోళనలు విడ్డూరం

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

ఎయిడెడ్‌లో పోస్టులు భర్తీ చేయనని ఉత్తర్వులిచ్చింది ఆయనే

స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వం తీసుకుంటుంది 

భవిష్యత్తులో హైలీ ఎడ్యుకేటెడ్‌ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ 

మహా విద్యా యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు టీడీపీ కుట్రలు  

టీడీపీ, పచ్చ మీడియా విష ప్రచారాన్ని టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రశ్నించాలి 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల

సాక్షి, అమరావతి: ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టులను భర్తీ చేయబోనని ఉత్తర్వులు ఇచ్చిన ఘనుడు చంద్రబాబేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఈరోజు అదే చంద్రబాబు ఆందోళనలు చేయడం విడ్డూరమని మండిపడ్డారు. ఉత్తుర్వులు ఇచ్చేటప్పుడు బాబుకు బుద్ధి ఏమైందని, ఆయన హయాంలో చాలా ఘోరాలు జరిగాయని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. సజ్జల మాట్లాడుతూ.. ఎయిడెడ్‌ విద్యా సంస్ధల్లో టీచర్లు సరిపడా లేనందువల్ల వాటిలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని, యాజమాన్యాలు వాటిని నడపలేకపోతున్నాయని తెలిపారు.

ఆ సంస్థలను, టీచర్లను స్వచ్ఛందంగా అప్పగిస్తే ప్రభుత్వం నడుపుతుందని, లేదా టీచర్లను సరెండర్‌ చేసి మీరే విద్యా సంస్థలను నడుపుకోవాలని ఓ విధానాన్ని తెచ్చినట్లు తెలిపారు. ఇందులో బలవంతం లేదు అని కూడా స్పష్టంగా చెప్పిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేపడుతున్న చర్యలతో రానున్న ఐదు, పదేళ్లల్లో మన రాష్ట్రం హైలీ ఎడ్యుకేటెడ్‌ రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పారు. ఫీజుల నియంత్రణకు, విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. పేదల సంక్షేమం కోసం జరుగుతున్న మహా విద్యా యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు.

అనంతపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఎయిడెడ్‌ విద్యా సంస్థలో వాళ్లు గొడవ చేస్తే చంద్రబాబు కొడుకు లోకేశ్‌ అక్కడకు వెళ్లి కారుకూతలు కూస్తున్నారని అన్నారు. పేద విద్యార్థులు చదువుకోవడం ఎలా అని లోకేశ్‌ అంటున్నాడని, ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మ ఒడి ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తోన్న విషయం గుర్తిస్తే మంచిదని చెప్పారు. చిన్న ఘటనను వారే సృష్టించి, ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. వారు చెబుతున్న కాలేజీని సరెండర్‌ చేయాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు.

స్వచ్ఛందంగా వచ్చే వారి కాలేజీలనే ప్రభుత్వం తీసుకుంటుందని, వెనక్కి తీసుకుంటామన్నా తిరిగి ఇచ్చేస్తుందని తెలిపారు. పదవి పోయిన నిస్పృహతో లోకేశ్‌ పచ్చమూకను వెంటేసుకొని అబద్ధాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ, పచ్చ మీడియా విష ప్రచారాన్ని అందరూ ప్రశ్నించాలని కోరారు. మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ఆశయాల కొనసాగింపులో భాగంగా సీఎం జగన్‌ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి  అంజాద్‌ బాషా చెప్పారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే అఫీజ్‌ ఖాన్, పార్టీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌ బాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top