
మొన్న నన్ను లోకేష్ పులి అన్నారు. ఇవాళేమో పార్టీ ఫిరాయించిన ఆయన్ని పులి అంటున్నారు..
సాక్షి, చిత్తూరు: టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నాకు ఆ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అందుకే టీడీపీ నుంచి బయటకు వస్తున్నా. త్వరలో నా భవిష్యత్ నిర్ణయం చెబుతా.. అని పలమనేరు టీడీపీ నేత ఆర్‌వీ సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు.
గంగవరం మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో తాజాగా ఆయన తన ఆత్మీయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ పార్టీ ఫిరాయించిన అమరనాథరెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచి చంద్రబాబు నన్ను విస్మరించారు. ఏకంగా మంత్రి పదవినే కట్టబెట్టారు. అనంతరం టీడీపీ అధిష్టానం నన్ను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎదురుకాని అవమానాలను ఎదుర్కొన్నా.
..2019 ఎన్నికల్లో అమరనాథరెడ్డికి నా వంతు సహకారం అందించా. ఆయన మంత్రిగా చేస్తున్న సమయంలో బస్సుల సర్వీసులకుగానూ ఇండసస్టట్రియల్ ఎస్టేట్‌లో కొంత స్థలాన్ని కేటాయించాలని విన్నవించినా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. సమస్యను తీసుకెళ్లా. ఒక్కసారికే నాకు స్థలం కేటాయించి ఆదుకున్నారు. ఒకప్పటి టీడీపీ బహిరంగ సభలో నన్ను పులిగా చెప్పుకొచ్చిన లోకేష్.. మొన్న యువగళం పాదయాత్రలో అమరనాథరెడ్డిని పులి అనడం, పాదయాత్ర పలమనేరు మీదుగా వెళ్లినా నన్ను ఏమాత్రం పట్టించుకోకపోవడం దేనికి సంకేతం?.
..ఇలా ఎన్నోరకాలుగా నాతోపాటు అభిమానులకు, శ్రేయోభిలాషులకు టీడీపీలో తీరని అన్యాయం జరిగింది. గౌరవ ప్రతిష్టలు లేని ఇలాంటి పార్టీకి సేవ చేయడం మానుకుంటున్నా అని భావోద్వేగంగా ప్రసంగించారాయన. ఈ ఆత్మీయ సమావేశానికి భారీ సంఖ్యలో అభిమానులు, ఆయన ఆత్మీయులు తరలివచ్చారు.