పల్లెప్రగతి అంతా డొల్ల..అందుకు జయశంకర్‌ స్వగ్రామమే నిదర్శనం

Revanth Reddy Fires on Kcr and Palle Pragathi Program - Sakshi

అభివృద్ధి ఎక్కడా కానరావట్లేదు 

వరంగల్‌ ఓఆర్‌ఆర్‌ భూసేకరణ విరమించుకోవాలి 

భూమి లాక్కుంటే రైతులు బతికేదెలా? 

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమం డొల్లతనానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్వగ్రామంలో జరిగిన అభివృద్ధే నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధిలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు వరంగల్‌ జిల్లాలో శనివారం పర్యటించిన సందర్భంగా తన దృష్టికి వచ్చిన విషయాలను వివరిస్తూ సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ ఆదివారం బహిరంగ లేఖ రాశారు.

‘ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నాను. అది ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్వగ్రామం. ఆయన లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించడం కష్టం. కానీ, రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లవుతున్నా ఆ గ్రామంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించట్లేదు. కనీస మౌలిక సదుపాయాల్లేవు. రెవెన్యూ గ్రామమనే హోదా కూడా ఇవ్వలేదు. ఆ ఊరికి మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదు. నిరుపేద దళితుడు సిలివేరు జానీ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. మీరేమో మిషన్‌ భగీరథ, దళితబంధు అని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. జయశంకర్‌ గ్రామంలో అభివృద్ధి జరగకపోవడం ఆ పెద్దమనిషి మీద మీకు ఎంత విద్వేషం, వ్యతిరేక భావం ఉన్నాయో చెబుతోంది. వెంటనే భగీరథ ద్వారా ఆ గ్రామానికి నీళ్లివ్వాలి. గ్రామంలోని నిరుపేద దళితులను ఆదుకోవాలి. అక్కంపేట అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు.  

వరంగల్‌ ఓఆర్‌ఆర్‌తో పచ్చని పొలాల్లో చిచ్చు 
వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ప్రాజెక్టు కోసం కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) ద్వారా పెద్ద ఎత్తున భూ సేకరణకు సిద్ధం చేస్తున్నారని.. ఆ ప్రాజెక్టు పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోందని రేవంత్‌ అన్నారు. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాలకు చెందిన 21,517 ఎకరాల భూమిని సేకరించడం ద్వారా లక్ష మందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ పేరుతో చిన్న, సన్నకారు రైతుల భూమిని లాక్కుంటే వారెలా బతకాలని ప్రశ్నించారు.

అభివృద్ధి ముసుగులో పేదల ఉసురు తీయొద్దని, భూ సేకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులకు కంటి మీద కునుకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్‌ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ఆ భూ సేకరణ జీవోను విరమించుకుంటున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే రైతులతో కలిసి కాంగ్రెస్‌ ఉద్యమిస్తుందని లేఖలో రేవంత్‌ వెల్లడించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top