navjot singh sidhu: ‘సీఎం అభ్యర్థి చాయిస్‌.. చాన్స్‌ కాదు’

Punjab Assembly Election 2022: Navjot Singh Sidhu Says CM Face Is Not Chance - Sakshi

ఎన్‌డీటీవీ ఇంటర్వ్యూలో పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ సిద్ధూ 

సొంత పార్టీ సీఎం చన్నీపైనే నేరుగా విమర్శలు 

క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నవారినే ఎంపిక చేయాలని డిమాండ్‌  

అంతిమంగా ప్రజాతీర్పే 

శిరోధార్యమని నర్మగర్భ వ్యాఖ్యలు 

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ స్వరం మారుతోంది. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న ఆయన ఇన్నాళ్లూ సీఎం అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌ అధిష్టానం చేతుల్లోనే ఉందని అంటూ వచ్చారు. పార్టీ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటానని చెప్పారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తరహాలో సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను టెలి ఓటింగ్‌ ద్వారా ప్రారంభించిన కాంగ్రెస్‌ రేపో మాపో ఒక ప్రకటన చేస్తుందనుకున్న సమయంలో ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు.

ఇసుక మాఫియా ఆరోపణలపై సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్‌ను ఈడీ అరెస్ట్‌ చేసిన రోజు సిద్ధూ నేరుగా చన్నీపైనే తన అస్త్రాలను సంధించారు. ఎన్‌డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో సీఎం అభ్యర్థికి  నీతినిజాయితీలే ముఖ్యమంటూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అధిష్టానం నిర్ణయం ఒక్కటే చాలదని ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉండాలంటూ తాను ఎంతకైనా తెగిస్తానని పరోక్ష సంకేతాలు ఇచ్చారు.

ప్రశ్న: కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎలాంటివారై ఉండాలి ?  
జవాబు: కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిగా నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని, క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నవారిని ఎంపిక చేయాలి. కనీసం 17 ఏళ్ల ట్రాక్‌ రికార్డు చూడాలి. నైతికత కోల్పోయిన వారిని, అవినీతి, బంధుప్రీతి, మాఫియాతో సంబంధాలున్న వారిని ఎంపిక చేస్తే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఎన్నికల్లో పార్టీని నిలువునా పాతిపెడతారు.  

ప్రశ్న: మీరు సీఎం అభ్యర్థి అయ్యే అవకాశాలు ఏమేరకు ఉన్నాయంటారు?  
జవాబు: నేనే సీఎం అభ్యర్థినని అనుకోవడం లేదు. అలా చెబితే అది అహంకారమే అవుతుంది.  కానీ నేను ఒక్క మాట చెప్పగలను. నవజోత్‌ సింగ్‌ సిద్ధూ అంటే అల్లాటప్పా వ్యక్తి కాదు. సెలెబ్రిటీ హోదాలో ఉండి ఆరు ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తుల్ని మీరు ఎంతమందిని చూశారో చెప్పండి. వాస్తవానికి ప్రజలే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. ప్రజావాణినే ఆ దేవదేవుడి శాసనంగా భావించాలి.  
 

ప్రశ్న: కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా మీకు ఆమోదయోగ్యమేనా?  
జవాబు: నాకు అంగీకారమా కాదా అన్నది విషయం కాదు. ఆ నాయకుడికి ప్రజామోదం లభించాలి. ఎమ్మెల్యేల మద్దతు కూడా కచ్చితంగా ఉండాలి. ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరైనా సీఎం కాగలరా?  కనీసం 60 మంది ఎమ్మెల్యేల మద్దతైనా ఉండాలి.  

ప్రశ్న: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌ ఎలా ఉండబోతోంది?  
జవాబు: ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి నీతి నిజాయితీ కలిగిన వారి నాయకత్వం అత్యంత అవసరం.  సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపైనే పార్టీ భవిష్యత్‌ ఆధారపడి ఉంది. సీఎం అభ్యర్థి ఎప్పుడైనా ఛాయిస్‌ అవాలి. అంతే తప్ప చాన్స్‌ తీసుకోకూడదు (విస్తృత ప్రజామోదం ఉన్న నాయకుడు కావాలేగాని... అధిష్టానం ఎంపిక చేసిన ఎవరో ఒకరు కాకూడదు). ఎవరికి పార్టీని గెలిపించే సత్తా ఉందో కాంగ్రెస్‌ పెద్దలు తెలుసుకోవాలి. మాఫియా దందాలు చేసే వ్యక్తి పార్టీ కార్యక్రమాలను అమలు చేయగలరా? అవినీతిపరుల్ని కాపాడేవారికి పగ్గాలు అప్పగిస్తే, వాళ్లు మాఫియాను ఎలా అంతం చేయగలరు?  

ప్రశ్న: అమృత్‌సర్‌ (తూర్పు) నియోజకవర్గం అభ్యర్థిగా మీ లక్ష్యం ఏమిటి? శిరోమణి అకాలీదళ్‌ నాయకుడు బిక్రమ్‌సింగ్‌ మజితాయి ఎంతవరకు పోటీ ఇస్తారు?  
జవాబు: నేను భావితరం బాగోగుల కోసం పోరాటం చేస్తాను. భావితరం బాగుంటేనే దేశ భవిష్యత్‌ బాగుంటుంది. ఇప్పుడు జరుగుతున్నది ధర్మపోరాటం.ధర్మం ఎటువైపు ఉంటే విజయం అటువైపే ఉంటుంది. ధర్మయుద్ధంలో అకాలీదళ్‌ ఎప్పటికీ నెగ్గలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top