Punjab Assembly Election 2022: దళితుల చేతిలోనే.. పంజాబ్ అధికార దండం

Punjab Assembly Election 2022: Dalit Vote Bank Play Key Role - Sakshi

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. కానీ వీరి చేతిలో  2.3 శాతం భూమి మాత్రమే ఉండటం గమనార్హం.

ఛండీఘడ్‌: పంజాబ్‌లో రాజకీయం పంచముఖ పోరుగా మారడం, కాంగ్రెస్‌కు మారుపేరుగా నిలిచిన కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ హస్తం పార్టీకి గుడ్‌బై కొట్టి... బీజేపీతో జట్టుకట్టడంతో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్‌–కొత్తగా మాయావతి పార్టీ బీఎస్పీతో పొత్తపెట్టుకోవడం, ఆమ్‌ ఆద్మీ పార్టీ... దళిత ఎమ్మెల్యే హర్బాల్‌ సింగ్‌ (దిర్బా నియోజకవర్గం)ను అసెంబీల్లో ఆప్‌ పక్ష నేతగా నియమించడం... ఇలా ఇప్పుడు పంజాబ్‌ రాజకీయమంతా దళితుల చుట్టూనే తిరుగుతోంది.

వాస్తవంగా చెప్పాలంటే... పంజాబ్‌ రాజకీయాల్లో జాట్‌ సిక్కులదే  ఆధిపత్యమైనప్పటికీ... ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. రాష్ట్ర జనాభాలోని 60 శాతం సిక్కుల్లో జాట్‌ల వాటా 21 శాతమే అయినప్పటికీ అదే ఆధిపత్య వర్గం. రాజకీయ నాయకత్వమంతా దశాబ్దాలుగా ఈ వర్గం చేతిలోనే కేంద్రీకృతమవుతోంది.

ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు దళితుల ఓట్లు తోడైతేనే ఏ పార్టీ అయినా ప్రస్తుతం పంజాబ్‌ సీఎం పీఠాన్ని అందుకోగలుగుతుంది. ఎందుకంటే పంజాబ్‌ జనాభాలో దేశంలో మరే రాష్ట్రంలో లేని  విధంగా ఏకంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. మూడింటి ఒకవంతున్న దళిత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు రాజకీయపక్షాలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.  

10 నెలల కిందటే మొదలుపెట్టిన బీజేపీ 
మూడు నూతన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలిక భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్‌ ఎన్డీయేను వీడటంతోనే కమలదళం అప్రమత్తమైంది. ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో (ఫిబ్రవరి 20న జరగనున్నాయి) తాము గెలిస్తే దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని గత ఏప్రిల్‌లోనే ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ వర్గంలో కొత్త ఆశలు రేకెత్తించింది.

అమరీందర్‌ సింగ్‌– సిద్ధూల మధ్య గొడవ తలకుమించిన భారం కావడంతో కాంగ్రెస్‌ గత ఏడాది సెప్టెంబరులో తెగించేసింది. జాట్‌ సిక్కు అయిన కెప్టెన్‌ అమరీందర్‌ స్థానంలో రవిదాసియా వర్గానికి చెందిన దళితుడైన చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీని సీఎంగా నియమించి అందరికంటే ముందుగానే దళిత ఛాంపియన్‌ అనిపించుకునే ప్రయత్నం చేసింది. గురు రవిదాస్‌ జయంతిని పురస్కరించుకొని... ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా మరో ఆరురోజులు ముందుకు జరిపి ఈ నెల 20 నిర్వహించాలని పంజాబ్‌ సీఎం చన్నీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు.

మిగతా రాజకీయపక్షాలన్నీ ఆయన డిమాండ్‌కే మద్దతు పలకడంతో ఈసీ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ చర్య దళితుల్లో చన్నీ గ్రాఫ్‌ను అమాంతంగా పెంచేసిందని రాజకీయ పండితులు విశ్లేషణ. అయితే అధికార వ్యతిరేకతను అధగమించడం, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కొట్టే సిక్సర్లను తట్టుకోవడం లాంటి పనులతోనే పాపం చన్నీ బిజీగా గడపాల్సి వస్తోంది. 

దళితుల్లోనూ మళ్లీ రెండు వర్గాలు 
పంజాబ్‌లోని దళితుల్లో... హిందు దళితులు, సిక్కు దళితులుగా రెండు వర్గాలున్నాయి. హిందు దళితుల శాతం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటానికి కారణం... వీరిలో చాలా మంది సిక్కు మతంలోకి మారిపోవడం, రవిదాసియా, ఆది ధర్మిలు మాత్రం తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. 2018 సామాజిక సాధికార శాఖ గణాంకాల ప్రకారం పంజాబ్‌ దళితుల్లో మొత్తం 39 ఉపకులాలున్నాయి. వీటిలో ఐదు ప్రముఖమైనవి.

రాష్ట్రంలోని 32 శాతం దళిత జానాభాలో వీటి వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. మజ్‌హబీ సిక్కులు అత్యధికంగా 30 శాతం ఉండగా... తర్వాత రవిదాసియాలు 24 శాతం మేరకు ఉంటారు. కాగా ఆది ధర్మీలు 11 శాతం ఉంటారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే... దౌబాలో 37 శాతం, మాల్వాలో 31 శాతం, మజ్హాలో 29 శాతం దళితులున్నారు. మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్‌లో 34 సీట్లు ఎస్సీలకు రిజర్వు చేశారు. 2017లొ ఈ 34 స్థానాల్లో కాంగ్రెస్‌ ఏకంగా 21 నెగ్గగా, ఆప్‌ 9 సీట్లు గెల్చుకుంది. 

డేరాల ప్రభావం క్షీణించినట్లేనా!
గతంలో దళిత ఓటర్లపై డేరా సచ్చా సౌదా (సమానత్వాన్ని ప్రబోధించే ధ్యాన కేంద్రా)ల ప్రభావం తీవ్రంగా ఉండేది. డేరాసచ్చా సౌదా అధిపతి రామ్‌రహీమ్‌ సింగ్‌ అత్యాచారం, హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉండటంతో దళితులపై ఈ డేరాల ప్రభావం మునుపటి స్థాయిలో లేదు. 69 సీట్లున్న మాల్వా ప్రాంతంలో గత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ తీవ్రంగా దెబ్బతింది. అకాలీ దళిత ఓటు బ్యాంకు కాస్తా కాంగ్రెస్‌ బదిలీ అయింది.  

ఐక్యత లేదు..
పంజాబ్‌లో జనాభాలో దళితులు ఏకంగా 32 శాతం ఉన్నప్పటికీ... వారి మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యత లేకపోవడమే వీరిని దెబ్బతీస్తోంది. ఏదో ఒక ఆధ్యాత్మిక బోధకుడి సూక్తులకు కట్టుబడి ఉండకపోవడం, భిన్నమైన ఆచారాలు, సంస్కృతులు ఉండటం మూలంగా పంజాబ్‌ దళితుల్లో ఐక్యత లోపించి బీఎస్సీ ఇక్కడ దారుణంగా విఫలమైందని, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కనీసం ఒక్క సీటును కూడా గెలవకపోవడానికి ఇదే కారణమని పంజాబ్‌ యూనివర్శిటీకి చెందిన డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ విశ్లేషించారు.  

 – నేషనల్‌ డెస్క్, సాక్షి 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top