Puducherry: 40 ఏళ్లకు మహిళా మంత్రి 

Puducherry: Chandirapriyanga woman Minister After 40 years In Puducherry Cabinet - Sakshi

నేడు పుదుచ్చేరి కేబినెట్‌ ప్రమాణ స్వీకారం

పుదుచ్చేరిలో 40 ఏళ్ల అనంతరం ఓ మహిళ మంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ ఛాన్స్‌ కారైక్కాల్‌ నెడుంగాడు నుంచి గెలిచిన చంద్ర ప్రియాంకకు దక్కింది. మంత్రి వర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుంది.  

సాక్షి, చెన్నై : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, సీఎం రంగస్వామి ఎట్టకేలకు 52 రోజుల తర్వాత మంత్రి వర్గం జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. జాబితాను ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు. ఇందుకు కేంద్ర హోం శాఖ, రాష్ట్రపతి భవన్‌ ఆమోద ముద్ర వేశాయి. ఆదివారం సాయంత్రం 3 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం రాజ్‌ నివాస్‌లో జరగనుంది. బీజేపీకి చెందిన నమశ్శివాయం, సాయి శరవణన్‌ కుమార్, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మినారాయణన్, తేని జయకుమార్‌కు మంత్రి పదవులు దక్కాయి.  

40 ఏళ్ల తర్వాత మహిళకు అవకాశం 
పుదుచ్చేరి మంత్రి వర్గంలో 40 ఏళ్ల అనంతరం ఓ మహిళకు చోటు దక్కింది. 1980– 1983లో కాంగ్రెస్‌– డీఎంకే కూటమి మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన రేణుకఅప్పాదురై మంత్రిగా పనిచేశారు.  ఆ తర్వాత మహిళలకు మంత్రి పదవులు దక్కలేదు. తాజాగా రంగన్న కేబినెట్‌లో కారైక్కాల్‌ ప్రాంతీయం నుంచి నెడుంగాడు రిజర్వుడు స్థానంలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన చంద్రప్రియాంకకు మంత్రి పదవి దక్కింది.

పదిహేను నిమిషాల్లో ప్రమాణ స్వీకారం ముగిసేలా రాజ్‌ నివాస్‌లో ఏర్పాట్లు జరిగాయి. వంద మందికి మాత్రమే అనుమతిచ్చారు. మాజీ మంత్రి, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత రాజవేలుకు పదవి దక్కని దృష్ట్యా ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాగే బీజేపీ నేత, ఎమ్మెల్యే జాన్‌కుమార్‌ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
చదవండి: మిషన్‌ 2022పై కమలదళం కసరత్తు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top