టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు.. ‘పట్నం’ మున్సిపాలిటీలో ముదిరిన వైరం

Political War Between Councillors And Chairpersons In Ibrahimpatnam - Sakshi

సాక్షి, ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): ‘పట్నం’ పురపాలక సంఘం పాలక వర్గం వ్యవహారశైలి రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతితో అమీతుమీ తేల్చుకునేందుకు అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మూకు మ్మడిగా మంత్రి సబితారెడ్డికి ఫిర్యాదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లకు ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా మిగతా వారంతా అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన వారే. చైర్‌ పర్సన్, అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య ఆరు నెలలుగా వైరం కొనసాగుతోంది. అదికాస్తా తీవ్రరూపం దాల్చింది.

అక్రమ వసూళ్లతోపాటు మున్సిపాలిటీలో రూ.2 కోట్లకు పైగా తప్పుడు బిల్లులు, రికార్డులు సృష్టించి చైర్‌పర్సన్‌ అవినీతి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌కు ఫిర్యాదు చేయగా మే 26న మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చిన ఆయన రికార్డులను సీజ్‌ చేసి వెంట తీసుకెళ్లారు. అవినీతి ఆరోపణలపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని చైర్‌ పర్సన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఏమైందో తెలియదుగానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అనంతరం చైర్‌పర్సన్‌పై చర్యలు తీసుకోవాలంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్‌ అమయ్‌కుమార్, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ అధికారుల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టినా ఫలితం కనిపించలేదు.

దీంతో అధికార చైర్‌ పర్సన్‌ అధ్యక్షతన జరిగే కౌన్సిల్‌ సమావేశాలకు డుమ్మా కొట్టారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చైర్‌పర్సన్‌ అవినీతిపై నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థానలు, ప్రారంభోత్సవాలకు ఎవరివారే అన్నట్లు వ్యవహరించారు. అధికార పార్టీ వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరితో కౌన్సిలర్లు జతకట్టారు. ఒకే పనిని చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్‌ వేర్వేరుగా చేపట్టడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అధికార పార్టీ కౌన్సిలర్ల మద్దతు లేకున్న చైర్‌ పర్సన్‌ ఒంటరిగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటుండంతో కౌన్సిలర్లకు మింగుడు పడటం లేదు.  

రూటు మార్చిన కౌన్సిలర్లు  
చైర్‌పర్సన్‌పై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారికంగా చర్యలు లేకపోవడంతో కౌన్సిలర్లు రూటు మార్చారు. కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. చైర్‌పర్సన్‌పై చర్యలు తీసుకోకుంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి, కౌన్సిలర్ల పదవులకు రాజీనామాలు చేస్తామని ఏకంగా మంత్రి సబితారెడ్డికి ఎమ్మెల్యే సమక్షంలోనే తెగేసి చెప్పారు. చైర్‌ పర్సన్‌ అవినీతి, అక్రమాలతో పార్టీకి, తమకు చెడ్డపేరు వస్తోందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఒక్కసారిగా 15 మంది కౌన్సిలర్లు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే కోణంలో అధికార పార్టీ నేతలు ఆలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది.   

ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కనుసన్నల్లోనే..! 
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే మాట కాదని చైర్‌పర్సన్‌పై ఫిర్యాదు చేసేంత సాహసానికి కౌన్సిలర్లు ఒడిగట్టరనే వాదన వినిపిస్తోంది. చైర్‌ పర్సన్‌ అవినీతి చిట్టా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ఫిర్యాదుల పర్వానికి కౌన్సిలర్లు తెరలేపారని.. ఆమె వ్యవహారశైలి కూడా ఎమ్మెల్యేకు నచ్చడం లేదనే చర్చ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో చైర్‌పర్సన్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లడం లేదని తెలుస్తోంది.  రోజురోజుకూ ముదిరిపాకాన పడి తారాస్థాయికి చేరిన మున్సిపాలిటీ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాలి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top