సాక్షి, తాడేపల్లి: దేశంలో తప్పుడు రాజకీయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట.. ఎప్పటికప్పుడు వింత పోకడలతో దిగజారుడు రాజకీయాలు చేస్తారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం గతంలో చూశాం. ఇప్పుడు డబ్బు ఇచ్చి పదవులు కొనుక్కునే పరిస్థితి తెచ్చారు’’ అంటూ మండిపడ్డారు.
‘‘డబ్బులు ఇచ్చి రాజీనామా చేయిస్తారు. తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన వారికి పదవులు ఇస్తారు. పదవులు కొనుక్కునే వారిని కూడా చంద్రబాబే చూస్తారు. ముందే బేరం మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి రాజీనామాను చేయిస్తారు. ఎన్టీఆర్ హయాం నుండి ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయటం చంద్రబాబు కు అలవాటే. ప్రజాస్వామ్యం, చట్టం, విలువులు అనేవీ పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి నాయకులు వస్తారని రాజ్యాంగం రాసేటపుడు అంబేద్కర్ కూడా ఊహించి ఉండరు’’ అంటూ పేర్ని నాని చురకలు అంటించారు.
‘‘వైద్యం చేయించుకోకపోతే చచ్చిపోతాడని బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పటికీ ఆస్పత్రి కి వెళ్లలేదు. అధికారులను బెదిరించి తన మీద ఉన్న కేసులను మూయించేసుకుంటున్నారు. బెయిల్ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. అధికారాన్నిఅడ్డం పెట్టుకుని కేసులు మాఫీ చేయించుకుంటున్నారు. అమరావతిని చంద్రబాబు చంపేశారు. అసలైన కుట్ర దారు చంద్రబాబేనని రాజధాని రైతులే అంటున్నారు. అమరావతికి ఏ పరిశ్రమా రావటం లేదు. పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వైజాగ్ వెళ్తుంటే ఇక అమరావతిలో భూములకు రేట్లు ఎలా వస్తాయి?
..హైవే నిర్మాణం చేస్తూ జగన్ రైతులకు మేలు చేశారు. ప్రధాన రోడ్డుకు పక్కనే చంద్రబాబు ఎలా ఇల్లు కట్టుకోగలిగారు?. రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా మళ్ళీ రెండు విడత భూసమీకరణ ఎలా చేస్తారని రైతులే ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది కేవలం కేవలం దోచుకోవటానికి, తమ మీద ఉన్న కేసులను మాఫీ చేసుకోవటానికే. దోచుకున్న సొమ్మంతా దుబాయ్‌లో దాచుకుంటున్నారు. దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన చంద్రబాబు పునీతుడు కాదు. కచ్చితంగా చంద్రబాబు మీద ప్రకృతి తిరగపడుతుంది. అప్పుడు ఇవే కోర్టులు చంద్రబాబును జైలుకు పంపుతాయి
..గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్ల చనిపోవటంపై శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించాలి. రైతులతో పాటు కొబ్బరి చెట్లకు కూడా ఊపిరి పోయాలి. ప్రజల అవసరాలు తీర్చటం చేతకాకే పవన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ విమానాలు ఎలా తిరుగుతున్నారు. రూ.50 కోట్ల విలువైన భూమిని ఎకరా 99 పైసలకే తీసుకున్న వారు పెడుతున్నారా?. లోకేష్ బినామీలు ఖర్చు పెడుతున్నారా?. ఎవరు డబ్బు ఖర్చు చేస్తే విమానాల్లో తిరుగుతున్నారో లోకేష్ చెప్పాలి. చంద్రబాబు బినామీ పేరుతో హెలికాఫ్టర్ కొన్నారు. మరి లోకేష్ వాడుతున్న విమానాలకు డబ్బు ఎవరు కడుతున్నారు?. వారానికి రూ.20 లక్షల ఖర్చు ఎవరు చేస్తున్నారో చెప్పే దమ్ముందా?
చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. దీనిపై నేనే స్వయంగా ఆర్టీఐ ద్వారా అడిగి రెండేళ్లయినా ఎందుకు ఇవ్వటం లేదు?. పవన్ కళ్యాణ్ సినిమా మ్యాట్నీకే ఎవరూ వెళ్లటం లేదు. నిర్మాతలు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు జీఎస్టీ కూడా నిర్మాతలు చెల్లించలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దుర్మార్గపు విషపు ప్రచారాలను జనం నమ్మారు. ఇప్పుడు వారి మోసాన్ని జనం గ్రహించారు. తగిన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారు’’ అని పేర్ని నాని అన్నారు.


