ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్‌ కోతల్లేవు.. పవన్‌ కరెంట్‌ ఆపేశారు

Peddireddy Ramachandra Reddy On Pawan Kalyan - Sakshi

పవర్‌ హాలిడే ఎప్పుడో ఎత్తేశాం: పెద్దిరెడ్డి

చంద్రబాబు కుప్పంలో చేసినట్లుగానే పవన్‌ కరెంట్‌ ఆపేశారు

సాక్షి, విశాఖపట్నం/తగరపువలస (భీమిలి) :రాష్ట్రంలో కరెంట్‌ కోతల్లేవని.. పవర్‌ హాలిడే ఎప్పుడో ఎత్తేశామని రాష్ట్ర మైనింగ్, అటవీ, విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ కూడా ముందస్తు ప్రణాళికలో భాగంగా పవర్‌ నిలిపివేసి మొబైల్‌ ఫోన్‌ లైట్లలో మీటింగ్‌ నిర్వహించారన్నారు.

విశాఖలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి విద్యుత్, మైనింగ్, అటవీశాఖ అధికారులతో శనివారం పెద్దిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రామకుప్పంలో చంద్రబాబు కాగడాల ప్రదర్శన కోసం ఉద్దేశపూర్వకంగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి ర్యాలీ చేపట్టారని.. ఆ అడుగుజాడల్లోనే శుక్రవారం పవన్‌కల్యాణ్‌ కూడా నడిచారని ఎద్దేవా చేశారు. 

బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకం
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు తమ పార్టీ ముందు నుంచీ వ్యతిరేకమని పెద్దిరెడ్డి అన్నారు. తవ్వకాలు జరపవద్దని వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేత హోదాలో చెప్పారని.. అలాగే, నాటి ప్రజా సంకల్పయాత్రలోనే గిరిజనులకు హామీ కూడా ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. కోర్టు కూడా మాకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు.  

ఈనాడు, ఆంధ్రజ్యోతివి తప్పుడు రాతలు
మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం నియోజకవర్గం చెట్లపాలెంలో ధాన్యం కొనుగోలు చేయలేదని తప్పుడు రాతలు రాశారని, అధికారులు అక్కడి వెళ్లి ఆరాతీస్తే 25 రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు వార్తలు రాశారని మంత్రి మండిపడ్డారు. ఈనాడు పత్రికలో రైతు ప్రమేయం లేకుండా ఫొటోవేసి అభిప్రాయం రాశారని విమర్శించారు. 

పోలవరం పూర్తిచేస్తే టీడీపీ పోటీచేయదా..
అనంతరం.. తగరపువలస చిట్టివలస బంతాట మైదానంలో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ భీమిలి జోన్‌ 1, 2, 3 వార్డులకు చెందిన 3,190 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. రానున్న రెండేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో పోలవరం పనులు పూర్తిచేస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ పోటీచేయదా అని ప్రశ్నించారు. అవినీతికి తావులేకుండా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తుంటే అభివృద్ధి జరగలేదని టీడీపీ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top