
ఊత కర్రలుగా బీజేపీ, జనసేన
అమలుకు సాధ్యం కానివి.. సూపర్ సిక్స్ హామీలు
వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి
వాకాడు (తిరుపతి జిల్లా) : అబద్ధాల చంద్రబాబు చేతిలో ఎన్నోసార్లు మోసపోయిన ప్రజలు.. అమలుకు సాధ్యం కాని సూపర్ సిక్స్ హామీలిస్తున్న ఆయనను నమ్మే పరిస్థితి లేదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వాకాడులో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగించారు.
పెద్దిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసి మళ్లీ ధైర్యంగా ఎన్నికలకు వస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని, ఊతకర్రలుగా బీజేపీ, జనసేన పార్టీలను పట్టుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నాడని తెలిపారు. రాజకీయాల్లో నిబద్ధత లేకుండా సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు.
2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ, బంగారు రుణాల తొలగింపు, ఇంటికో ఉద్యోగం, ఇస్తామని నిరుద్యోగులను, రైతులను, మహిళలను మోసం చేశారన్నారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కలసి కట్టుగా పనిచేసి మరోసారి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేసుకుందామన్నారు. ఎంపీ గురుమూర్తి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళీధర్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, గూడూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేట, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.