ఎన్డీఏకు నితీశ్ రాంరాం.. కూలిపోనున్న బిహార్ సర్కార్‌.. షాక్‌లో బీజేపీ!

NDA JDU Split Nitish Kumar RJD Tieup Bihar - Sakshi

పట్నా: ఎన్డీఏతో మిత్రపక్షం జేడీయూ తెగదెంపులు చేసుకోనుందా?  ఆగస్టు 11కు ముందే బిహార్‌లో జేడీయూ-బీజేపీ సర్కార్ కూలిపోనుందా? నితీశ్‌ కుమార్‌ మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది. బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మిత్రపక్షం బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ చాలా కాలంగా అంటీమున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సహా జులై 17 తర్వాత కేంద్రం నిర్వహించిన నాలుగు సమావేశాలకు నితీశ్ డుమ్మా కొట్టారు. దీంతో ఎన్డీఏ నుంచి ఆయన విడిపోనున్నారనే వాదనలకు మరింత బలం చేకూరింది.

అంతేకాదు నితీశ్ మళ్లీ ఆర్‌జేడీతో జట్టుకట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలను కూడా కలుపుకొని బిహార్లో బీజేపీకి షాక్ ఇస్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన ఆయా పార్టీలతో చర్చలు  జరుపుతున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రభుత్వంలో భాగమైన బీజేపీతో విడిపోయి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నితీశ్ భావించినా.. అందుకు జేడీయూ ఎమ్మెల్యేలు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆర్జేడీ మద్దతు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

నాలుగుసార్లు డుమ్మా
జులై 17న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించిన సమావేశానికి నితీశ్ హాజరుకాలేదు. రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోతున్న సందర్భంగా రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి కూడా వెళ్లలేదు. ఆ తర్వాత జులై 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకరానికి కూడా నితీశ్ డుమ్మా కొట్టారు. తాజాగా ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో ఆయన ఎన్డీఏకు రాంరాం చెప్పడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

ఆర్‌సీపీ సింగ్‌పై అసంతృప్తి..
జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్‌ పార్టీకి శనివారమే రాజీనామా చేశారు. ఆయన కుమార్తెల అక్రమాస్థులకు సంబంధించి సీఎం వివరణ కోరడంతో పార్టీని వీడారు. అయితే ఆర్‌సీపీ సింగ్‍పై నితీశ్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం. గతేడాది మోదీ కేబినెట్‌ను విస్తరించినప్పుడు ఆర్‌సీపీ సింగ్‌ను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా జరగడంపై నితీశ్ తీవ్ర అసహనంతో ఉన్నారు. అలాగే మోదీ కేబినెట్‌లో రెండు బెర్తులు కావాలని నితీశ్‌ అడిగితే కేంద్రం అందుకు ఒప్పుకోలేదు.

అమిత్ షాపై నమ్మకం లేదా?
ఇటీవలే పట్నాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎ‍న్నికలతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే అని అమిత్‌ షా ప్రకటించారు. అయినా నితీశ్‌ బీజేపీపై నమ్మకంగా లేరని తెలుస్తోంది. బిహార్లో పట్టు సాధించాలని అమిత్‌షా భావించడం, ఆర్‌సీపీ సింగ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం,  రాష్ట్రంలో బలపడాలని బీజేపీ చూస్తుండటం వంటి అంశాలు నితీశ్‌ను కాస్త కలవరపాటుకు గురి చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్ర బీజేపీ నాయకులు తనపై బహిరంగంగా విమర్శలు కురిపిస్తుండటం అస్సలు నచ్చడం లేదట. 

అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదని నితీశ్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 11లోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఆర్‌జేడీతో చేతులు కలిపితే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లే అవుతుంది.
చదవండి: మహారాష్ట్ర  కేబినెట్‌ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top