Tamil Nadu: ఓడినా సత్తాచాటిన సీమాన్‌

Naam Tamilar Katchi Party Third Place In Assembly Elections In Tamilnadu - Sakshi

మూడో స్థానంలో నామ్‌ తమిళర్‌ కట్చి 

183 చోట్ల మూడో స్థానంలో నిలిచిన పార్టీ అభ్యర్థులు 

39 చోట్ల అన్నాడీఎంకే, 10 స్థానాల్లో డీఎంకే విజయావకాశాలకు గండి 

ప్రభావం చూపలేకపోయిన కమల్, దినకరన్‌ పార్టీలు 

సాక్షి, చెన్నై: నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ ఎన్నికల్లో ఓడినా సత్తా చాటుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థులు 183 నియోజకవర్గాల్లో 3వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. ఇక 39 చోట్ల అన్నాడీఎంకే అభ్యర్థుల విజయ అవకాశాలకు గండికొట్టారు. 

ఒంటరిగా బరిలోకి.. 
రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, పీఎంకే, మక్కల్‌ నీదిమయ్యం, ఎస్‌ఎంకే, ఐజేకే, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం తదితర పార్టీలు కూటములతో ఎన్నికలను ఎదుర్కొన్నాయి. అయితే సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. 234 స్థానాల్లో 117 చోట్ల మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. 

పుంజుకుంటున్న సీమాన్‌ 
తాజా ఎన్నికల్లో డీఎంకే పార్టీ 37.7 శాతం ఓట్లు సాధించి అధికారం దక్కించుకుంది. ఇక అన్నాడీఎంకే పార్టీ 33.29 శాతం ఓట్లు సాధించి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇక నామ్‌ తమిళర్‌ కట్చి 5 శాతానికి పైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. 2011 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన సీమాన్‌ పార్టీ 1.7 శాతం ఓట్లను దక్కించుకుంది. 2016లో 2.15 శాతం సాధించింది. కమల్‌ కూటమి, దినకరన్‌–విజయకాంత్‌ కూటమి నాలుగు స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఒక్కరూ గెలవలేదు కానీ.. 
తాజా ఎన్నికల్లో సీమాన్‌తో పాటు ఆ పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. అయితే ఇతరుల విజయావకాశాలను మాత్రం దెబ్బతీశారు. తిరువొత్తియూరులో పోటీ చేసిన సీమాన్‌ ఓటమి పాలైనా 48,597 ఓట్లు పొందారు. తూత్తుకుడిలో ఆ పార్టీ అభ్యర్థి వేల్‌రాజ్‌ 30,741 ఓట్లు రాబట్టుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో 183 చోట్ల నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థులు 3వ స్థానంలో నిలవడం గమనార్హం. మొత్తంగా 5 శాతానికి పైగా ఓట్లు సాధించారు. 39 నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే ఓట్లకు చీల్చి వారి విజయావకాశాలను దెబ్బ తీశారు. అలాగే 10 చోట్ల డీఎంకే, 5 చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థుల ఓట్లకు గండికొట్టారు. మరోవైపు దినకరన్‌ పార్టీ 20 చోట్ల అన్నాడీఎంకే ఓట్లను చీల్చి వారి విజయావకాశాలను దెబ్బ తీసింది. 

పదిహేనేళ్ల తర్వాత అసెంబ్లీకి ప్రాతినిధ్యం 
డీఎంకే కూటమితో ఎన్నికలను ఎదుర్కొన్న వీసీకే, ఎండీఎంకే పార్టీలు చెరో నాలుగు స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలకు 2006 తర్వాత అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయాయి. తాజా గెలుపుతో ఆ పార్టీల అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఇక పీఎంకే, సీపీఎం, సీపీఐ సభ్యులు ఐదేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఇక మేట్టూరులో పోటీచేసిన ఎన్నికల వీరుడు పద్మరాజన్‌కు ఈసారి 36 ఓట్లు రావడం విశేషం. అలాగే సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (తొండముత్తూరు), మైల్‌ స్వామి (విరుగ్గంబాక్కం)లలో పోటీ చేయగా నోటా కన్నా తక్కువ ఓట్లు పడ్డాయి.
చదవండి: Kamal Haasan: ఒంటరిగా పోటీ చేసుంటే బాగుండేది!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top