నేను ఏర్పాటు చేస్తున్న ‘సమాఖ్య’లోకి రండి: ఎంకే స్టాలిన్‌

MK Stalin Letter To 37 Political Parties To Unite For Social Justice - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: నిర్లక్ష్యానికి గురవుతున్న వెనుకబడిన సామాజికవర్గాల సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేస్తున్న అఖిల భారత సామాజిక సమాఖ్యలో భాగస్వాములు కావాలని జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌తో పాటు దేశంలోని 37 పార్టీలకు బుధవారం ఈ మేరకు ఆయన లేఖ రాశారు. జాతీయ స్థాయిలో పార్టీలన్నీ సహకరిస్తేనే సామాజిక న్యాయం సాధ్యమని అందులో పేర్కొన్నారు. గత నెల 26న గణతంత్ర దినోత్సవం వేడుకల రోజు స్టాలిన్‌ ఈ సమాఖ్య ఏర్పాటును ప్రకటించడం తెలిసిందే.   

మతోన్మాదం, మతపరమైన ఆధిపత్యంతో మన దేశ ప్రత్యేకమైన, వైవిధ్యమైన, బహుళ-సాంస్కృతిక సమాఖ్యకు ముప్పు వాటిల్లిందని లేఖలో స్టాలిన్‌ పేర్కొన్నారు. సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయంపై విశ్వాసం ఉన్నవారంతా ఏకమైతేనే ఈ శక్తులతో పోరాడగలమని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ఏవిధంగా పోరాటం చేశామో.. అదే విశ్వాసం, ధ్యేయంతో ఏకం కావాలని పిలుపునిచ్చారు. (క్లిక్‌: 'సీఎం సార్‌ హెల్ప్‌ మీ'.. వెంటనే కారు ఆపి..)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top