Telangana Congress: ఠాక్రే మంతనాలతో కాంగ్రెస్ మూడ్ ఛేంజ్!

సాక్షి, హైదరాబాద్: కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న స్ఫూర్తితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ఇన్‌చార్జిగా నియామకమైన తర్వాత రెండు సార్లు రాష్ట్రానికి వచ్చిన ఆయన.. నేతలను కూర్చోబెట్టి మంతనాలు జరపడానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలందరితో విడివిడిగా, సామూహికంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలు, అంతర్గత విభేదాలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయనకు పూర్తి అవగాహనకు వచ్చినట్టేనని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.
ఆయన చర్యల ఫలితంగానే రాష్ట్ర కాంగ్రెస్‌లో మూడ్ మారిందని, నేతల్లో విభేదాలు దూరం అవుతున్నాయని చెప్తున్నాయి. రెండో దశ పర్యటనలో భాగంగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు పర్యటించిన ఠాక్రే ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలపై దృష్టి కేంద్రీకరించినా.. వచ్చే ఎన్నికల కోసం పార్టీ నేతలను సన్నద్ధం చేసే పనికి కూడా శ్రీకారం చుట్టారని అంటున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల్లో మూడో దఫా పర్యటనకు రానున్నారని చెప్తున్నాయి.
మీ వంతుగా ఏం చేశారు.. ఏం చేస్తారు?
తొలి పర్యటనలో పార్టీ సీనియర్లతో విడివిడిగా భేటీ అయిన ఠాక్రే.. తాజా పర్యటనలో పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలతో సమావేశమయ్యారు. కీలకమైన టీపీసీసీ ప్రచార కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలతో భేటీ అయి చర్చించారు. ఈ సందర్భంగా ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది.
పార్టీ బలంగా ఉందని, అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, పార్టీలో ప్రాధాన్యత కావాలని కొందరు నేతలు చెప్పడాన్ని సున్నితంగా తిరస్కరించిన ఆయన.. ఈ విషయాలన్నీ తాను చూసుకుంటానని, మీ వంతుగా ఏం చేశారు, ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించినట్టు సమాచారం. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో మీ టీంలు ఏం పనులు చేస్తున్నాయో చెప్పాలని నేతలను అడిగినట్టు తెలిసింది.
తొలుత ఎన్నికలకు సిద్ధమయ్యే దిశలో తమ కమిటీలు, బృందాలను సిద్ధం చేసుకోవాలని.. క్షేత్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సమాయత్తం చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా ఠాక్రే తన రెండో పర్యటనలోనే బహిరంగ సభకు, ఇతర కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారా తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం ప్రారంభించారనే చర్చ జరుగుతోంది.
చదవండి: రజాకార్లను తరిమినోళ్లం.. కేసీఆర్‌ను ఓడించలేమా?
మరిన్ని వార్తలు :