బెంగాల్‌లో ‘దీదీ’నే!

Mamata Banerjee to retain power with reduced majority In West Bengal - Sakshi

తమిళనాట డీఎంకే కూటమి ఘన విజయం

కేరళ, అస్సాంల్లో అధికార పక్షానిదే విజయం

టైమ్స్‌ నౌ– సీ ఓటర్‌ సర్వే

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాంల్లో అధికార కూటమే విజయం సాధిస్తుందని టైమ్‌ నౌ– సీ ఓటర్‌ సర్వే తేల్చింది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించింది. పుదుచ్చేరిలో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని, అయితే, 2016 కన్నా మెజారిటీ తగ్గుతుందని పేర్కొంది. అక్కడ బీజేపీ బలం పుంజుకున్నప్పటికీ.. అధికారం చేపట్టే స్థాయికి చేరుకోలేదని అంచనా వేసింది.
 
పశ్చిమబెంగాల్‌లో..: వరుసగా మూడోసారి పశ్చిమబెంగాల్‌ పీఠంపై ‘దీదీ’మమత బెనర్జీనే కూర్చోనుందని టైమ్స్‌ నౌ– సీ ఓటర్‌ సర్వే తేల్చింది. అయితే, గతంలో కన్నా మెజారిటీ తగ్గుతుందని పేర్కొంది. మొత్తం 294 సీట్లకు గానూ మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ 146 నుంచి 162 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. 2016 ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 211 స్థానాలతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్‌లో మార్చ్‌ 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

2016 ఎన్నికల్లో మూడే స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 99 నుంచి 115 స్థానాలను గెలుచుకుంటుందని టైమ్స్‌ నౌ– సీ ఓటర్‌ తేల్చింది. కాగా, కాంగ్రెస్‌–వామపక్షం–ఐఎస్‌ఎఫ్‌ కూటమి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపబోదని, ఆ కూటమికి 29 నుంచి 37 సీట్లు రావచ్చని టైమ్స్‌ నౌ – సీ ఓటర్‌ సర్వే తేల్చింది. ఓట్ల శాతం విషయానికి వస్తే టీఎంసీకి 42.2%, బీజేపీకి 37.5%, కాంగ్రెస్‌ కూటమికి 14.8% ఓట్లు వస్తాయంది. 2016 ఎన్నికల్లో బీజేపీ కేవలం 10.2% ఓట్లు సాధించిన విషయం గమనార్హం.

తమిళనాడులో..: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని యూపీఏ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది. ఈ కూటమి 158 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. మరోవైపు, అన్నాడీఎంకే – బీజేపీల ఎన్‌డీఏ 65 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని వెల్లడించింది. యూపీఏ 43.2%, ఎన్‌డీఏ 32.1% ఓట్లు సాధిస్తాయని తెలిపింది. గత ఎన్నికల్లో యూపీఏ 98 సీట్లలో, ఎన్‌డీఏ 136 సీట్లలో గెలుపొందాయి. తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రిగా స్టాలిన్‌కు మెజారిటీ ప్రజలు ఓటేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో స్టాలిన్‌ను 38.4%, పళనిసామిని 31%, కమల్‌హాసన్‌ను 7.4%, రజనీకాంత్‌ను 4.3%, పన్నీరుసెల్వంను 2.6%, శశికళను 3.9% మంది ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు బాగాలేదని 53.26% ప్రజలు అభిప్రాయపడగా, 34.35% సంతృప్తి వ్యక్తం చేశారు.

అస్సాంలో..: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ స్వల్ప మెజారిటీతో అధికారం నిలుపుకుంటుందని టైమ్స్‌ నౌ– సీ ఓటర్‌ సర్వే వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)ల కారణంగా బీజేపీపై వ్యతిరేకత పెరిగినప్పటికీ కొద్ది మెజారిటీతో ఎన్‌డీఏ గట్టెక్కుతుందని అంచనావేసింది. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్‌డీఏకు ఈ ఎన్నికల్లో 67 సీట్లు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు 57 స్థానాలు వస్తాయని సర్వే తేల్చింది. 2016 ఎన్నికల్లో ఎన్‌డీఏ 74, యూపీఏ 39 సీట్లు గెలుచుకున్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 42.29% ఎన్‌డీఏకు, 40.7% యూపీఏకు ఓటేస్తామన్నారని వెల్లడించింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీల కారణంగా యూపీఏ గణనీయంగా లాభపడిందని పేర్కొంది. ముఖ్యమంత్రిగా ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్‌కు 45.2% మద్దతు పలికారు. రెండో స్థానంలో కాంగ్రెస్‌ నేత సౌరవ్‌ గొగోయి ఉన్నారు. కాగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పనితీరుపై దాదాపు 70% సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.

కేరళలో..: కేరళలో వామపక్ష కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. మొత్తం 140 సీట్లకు గానూ అధికార ఎల్‌డీఎఫ్‌ 82 సీట్లను, కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్‌ 56 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చింది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఎల్‌డీఎఫ్‌ 42.9%, యూడీఎఫ్‌ 37.6% ఓట్లను సాధిస్తాయని వెల్లడించింది. గత ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ 91, యూడీఎఫ్‌ 47 సీట్లను గెలుచుకున్నాయి. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌పై 42.34% పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సర్వేలో పాల్గొన్నవారిలో 55.84% కాంగ్రెస్‌నేత రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటున్నామని తెలపడం విశేషం. ప్రధానిగా మోదీకి వారిలో 31.95% మాత్రమే మద్దతిచ్చారు.

పుదుచ్చేరిలో..: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి రానుందని టైమ్స్‌ నౌ – సీ ఓటర్‌ సర్వే వెల్లడించింది. మొత్తం 30 స్థానాలకు గానూ 18 స్థానాలను ఎన్‌డీఏ గెల్చుకుంటుందని, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ కూటమి 12 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏకు 45.8%, యూపీఏకు 37.6% ఓట్లు వస్తాయని తెలిపింది. 2016లో కాంగ్రెస్‌ – డీఎంకేల కూటమి 17 స్థానాల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎన్‌డీఏ 12 సీట్లు గెలుచుకుంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top