ఔటర్‌ లీజుపై రాష్ట్రపతికి లేఖ 

Letter to the President on Outer Lease says Bhatti Vikramarka - Sakshi

ఏజెన్సీకి అప్పగించడాన్ని కోర్టులో సవాల్‌ చేస్తాం 

 30 ఏళ్ల పన్నులు ఒకేసారి తీసుకుంటే రాబోయే ప్రభుత్వాలేంచేయాలి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 

సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ఔటర్‌ రింగ్‌ రోడ్డును ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించడాన్ని కట్టడి చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాస్తామని, కోర్టుకు కూడా వెళ్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి 30 ఏళ్ల పన్నులను ఒకేసారి తీసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలి? రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

భట్టి చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగుతోంది. బుధవారం ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యాదగిరిగుట్టలో ఆటో కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం గొల్లగుడెసెలు, దాతరుపల్లి గ్రామాల మీదుగా యాత్ర భువనగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

బస్వాపూర్‌ గ్రామంలో నిర్మిస్తున్న నృసింహసాగర్‌ రిజర్వాయర్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సమస్యలను ఆలకించారు. రిజర్వాయర్‌ కట్టపై మీడియాతో మాట్లాడుతూ ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఎకరానికి రూ.50–60 లక్షల ధర ఉంటుందని పేర్కొన్న సీఎం కేసీఆర్‌.. ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఎట్లా ఇస్తారని నిలదీశారు. భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి కోటిన్నర పరిహారం ఇవ్వాలన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top